విదేశాలలో తెలుగెందుకు?

కారణాలేమైతేనేం అవకాశం దొరికితే విదేశాలకెల్లడానికి అవసరం పడుతుందని ఆంగ్ల భాషని నేర్చుకుని ఎలాగోలా తెలుగు దేశం నుండి బయటపడ్డాం గదా!  ఇంకా తెలుగెందుకని చాలామంది ప్రశ్నిస్తున్నారు.  ఎలాగూ విదేశాలకు వచ్చాం గదా మన భాషతో పనేముంటుంది అన్నది మంచి ప్రశ్నే?  అయితే ఇక్కడ ప్రశ్నలోనే సమాధానముందని చాలామంది గ్రహించటం లేదు.   “మనం” అంటే ఒక భాష, ఒక బంధం, బాంధవ్యం, ఒక సంస్కృతీ, సాహిత్యం,  మన వాజ్మయం, ఒక ఆలోచనా సరళి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, తరతరాల వారసత్వం,  మన మాండలీకాలు,  కళలు, కళా రూపాలు,  ఇతిహాసాలు, కావ్యాలు, ప్రభంధాలు,  ప్రవచనాలు, శతకాలు, గేయాలు, గీతాలు, సామెతలు  – ఇలా ఒక మహోన్నతమైన సంస్కృతికి వారసులం  – ఒక చిన్న ప్రశ్నతో మన సంస్కృతిని కాలదన్నగలమా?  ముమ్మాటికి కాదు. 

ఆంగ్ల భాష నేర్చుకున్నారని ఎవరినీ తప్పు పట్టటం లేదు.  తెలుగువాళ్ళలో బహుభాషాకోవిదులు చాలామంది వున్నారు.  పరభాషా గ్రంధాలను అనువాదాలు చేసారు.  ఆంగ్ల భాషలో ఎంతో నైపుణ్యాన్ని సంపాదించారు.  బహుమతులు గెల్చుకున్నారు.  అయితే ఆంగ్ల భాషని నేర్చుకోవటానికి మాతృ భాషను తృణీకరించక్కర్లేదు.  మన భాష ప్రపంచంలోని చాలా భాషలకంటే ఎన్నో విధాలుగా మెరుగైన భాష.

మన భాష ప్రత్యేకం

ఇతర భాషలతో పోలిస్తే తెలుగు భాషకున్న కొన్ని ప్రత్యేకతలు:

 1. మన భాషలో షుమారు 1,25,000 పదాలున్నాయి. 
 2. ప్రపంచ భాషల్లో తెలుగు భాషకే చందో బద్ధమైన పద్య ప్రక్రియ వుంది.  వృత్తాలు, గీతాలు వాటి జాతులు, ఉప జాతులు కలిసి షుమారు 30 కి పైగా ఛందస్సు తో కూడిన పద్యాలు తెలుగు భాషలోనే ఉన్నాయి. 
 3. ప్రపంచ భాషల్లో తెలుగు అక్షర సౌందర్యం రెండవదిగా ఎంపికయ్యింది  (సౌత్ కొరియా మొదటిది).  
 4. భారత దేశంలో ఎక్కువ ప్రజలు మాట్లాడే భాషల్లో మూడవ స్థానం మనదే.
 5. ప్రపంచంలో ప్రస్తుతం షుమారు 18 కోట్ల మంది మన భాషని అర్ధం చేసుకోగలరు.  అంటే ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాల్లోని జనాభా సంఖ్యకు షుమారు 8 రెట్లు అన్న మాట.
 6. ప్రపంచంలోని మొదటి 10 స్థానాల్లో లేకపోయినప్పటికీ తెలుగు భాష ప్రపంచంలోని పలు దేశాల్లో ఒక ప్రాచీన భాషగా తెలుసు.
 7. హిందీ, ఆంగ్లం, బెంగాలీ భాషల తరువాత తెలుగు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో (ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా కాకుండా) మాట్లాడే భాష.

రెండు ముఖ్య కారణాలు
తెలుగెందుకు అన్న వారికి రెండు ముఖ్య కారణాలు:

 1. సౌత్ ఆఫ్రికా జాతి పితగా వర్ణింపబడ్డ శ్రీ నెల్సన్ మండేలా చెప్పినట్లుగా ఒకరికి అర్ధమయ్యే భాషలో మాట్లాడితే అది వారి మెదడు వరకే వెళ్తుంది.  అదే మాతృభాషలో మాట్లాడితే అది వారి హృదయానికి చేరుతుంది.
 2. ప్రతీ తెలుగువాడు తల్లి గర్భంలో ఉండగా మాతృ భాషలోనే తల్లి తనతో దోబూచులాడిన భాష.  ఇదొక అనన్య సామాన్యమైన అనుభూతి.  అంటే ఈ భూతలంపై పడకముందే తల్లి నీతో మాట్లాడిన మొదటి భాష తెలుగు భాష.

పైనుదహరించిన బలీయమైన రెండు కారణాలు “తెలుగెందుకు?” అన్నవారికి ఒక రకమైన సమాధానం ఇస్తుంది.

ఎవరు బాధ్యత తీసుకోవాలి?

కొన్ని వేల మైళ్ళ దూరంనుండి వచ్చి కన్న తల్లి పేగు బంధాన్ని తెంచుకున్నంత తేలికగా మన సంస్కృతీ వారసత్వాలకు తిలోదకలివ్వలేకపోవడం వలనే తెలుగు సంఘాలుని ఏర్పరచుకొని మనం అన్న బంధాన్ని మరింత పెంచుకున్నాం.  ఈ బంధానికి పాశం మన భాషే కనుక తెలుగు సంఘాలు మన భాషకు పెద్దపీట వేయాలి.  అవసరమయితే మన రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సంభాషణలు జరపాలి.  అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి.  వనరుల కోసం ప్రయత్నించాలి. 

క్రింది పట్టికలో వివిధ దేశాలు తమ మాతృ భాష కోసం చేస్తున్న కృషి వివరాలు పొందుపరచబడ్డాయి.  ఫ్రాన్స్ దేశం మన తెలుగు రాష్ట్రాల జనాభాతో పోలిస్తే తక్కువే.  అయినా వారు మాతృ భాషకిచ్చే ప్రాముఖ్యత వలన ప్రపంచ భాషల్లో ఎక్కువ మంది మాట్లాడే భాషగా ప్రాచుర్యం పొందింది.  మన తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో వైఫల్యం పొందాయన్నది నిర్వివాదాంశం.  దానికి మనం నిరాశ పడనక్కర్లేదు.  మనకున్న పరిధుల్లో మనం కృషి చేస్తే చాలు .    

 

             

 

 

ఈనాడు వారి తెలుగు వెలుగు సౌజన్యంతో…

మన పిల్లలు రోజుకున్న 24 గంటలలో 3వ భాగం పర భాషా సంస్కృతులలో గడుపుతున్నారన్నది నిజం.  మేల్కొని ఉన్న మరో భాగంలో అర్ధభాగం వారు హోం వర్క్, టివి మొదలైన వాటితో గడిపేస్తారు.  తల్లిదండ్రుల పని ఒత్తిడి బట్టి మిగతా భాగంలో మాట్లాడుకునే సమయం ఉండొచ్చు లేకపోవచ్చు.  ఇక్కడ రెండు ముఖ్యమైన పాత్రలు గురించి మాట్లాడుతున్నాం.  తల్లిదండ్రులు మరియు పిల్లలు.  “మ్రోక్కై వంగనిది మ్రానై వంగునా?” అన్న చందాన పిల్లల వయస్సు తక్కువగా వున్నపుడు తల్లిదండ్రులు మన భాష సంస్కృతీ పట్ల వారికి అభిమానం, అభిరుచి కలిగించాలి.  వీలైనంత సమయం కేటాయించి మన భాషపట్ల మమకారం పెంచాలి.  “తెలుగెందుకు?”  అన్న ప్రశ్న ఎప్పుడైనా వస్తుంది.  అది మొదట్లో వస్తే సమస్య జటిలం కాకుండా వుంటుంది.  తరువాత వస్తే పర్యవసానం మనందరికీ తెలిసిందే.

పిల్లలనే అడగండి

ఎవరైనా ఒక యుక్త వయస్సులో ఉండి ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిని గానీ అబ్బాయిని గానీ “తెలుగెందుకు నేర్చుకోవాలనుకుంటున్నావ్?” అని అడిగితే ముఖ్యంగా క్రింది సమాధానాలు వినవచ్చు.

 1.  భారతదేశం వెళ్ళినప్పుడు తాతయ్య, నాన్నమ్మ, బామ్మలు మరియు మన సంఘంలోని వాళ్ళతో మాట్లాడడానికి
 2. వలస వచ్చిన వాళ్ళు కొన్ని శతాబ్దాలు ఈ దేశాలలో వున్నా మన గుర్తింపు మన మాతృ దేశం మరియు మాతృ భూమితో ముడిపడి ఉంటుంది.  ఈ గుర్తింపుని కొనసాగించడం.
 3. కాలానుగుణంగా మన సంస్కృతీ సాంప్రదాయాల్లో కొన్ని మార్పులు రావడం సహజం.  అయినా మన సంస్కృతీ సంప్రదాయాలను వీలైనంతవరకూ వారసత్వాన్ని కొనసాగించడం. 

ఇక్కడ సమాధానాలు మాతృ భాష అవసరం సూచిస్తున్నాయి.  తెలుగు భాష ఒక ప్రణాళికా పరంగా అమలుచేయవలసిన ఆవశ్యకతను మనం గుర్తించాలి.  కార్యదీక్షతో ముందడుగు వేయాలి.

4 Comments

 1. శ్రీ మల్లికేశ్వర రావు గరి సమ్పాదకీయము ” విదెశలలొ తెలుగెందుకు?” అనె శ్న కు చక్కని ,తిరుగు లేనిమాధానము. వారు అభినంద నీయులు .సహ్రుదయమ్ ,భక్తి భవములున్న వారికే ఈ తర్కమ్ ,తలకెక్కు తుంది .అవి లేని వా రికెంత బొధపరచినా నమ్మించ లేము .
  భాస్కరరవు సరిపల్లి

 2. శ్రీ భాస్కర రావు గారికి
  సహృదయంతో మీరు వ్రాసిన కామెంట్ కి ధన్యవాదములు. తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ మాకు స్పూర్తినిస్తుంది. భువన విజయాన్ని విజయపథంలో మీరు ముందుండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు.

 3. మల్లికేస్వర రావు గారు మంచి మేలైన విషయాలని వివరించారు. విదేశాలలోని తెలుగు సంఘాలకు కూడా తెలుగు భాషని పునరుద్ధరించేందుకు చేయ వలసిన బాధ్యత ఎంతో ఉంది. కాని తెలుగు సంఘాలు కేవలం స్వప్రయోజనాలకు , రాజకీయాలకు, ధనార్జనకు కేంద్రీకృత మైపోయాయి. వీళ్ళంతా రాయప్రోలు వారి ఏదెస మేగిన – ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న సింహ ఘర్జనను ఏమరుస్తున్నారు. ఈ తెలుగు సంఘాలు చేసే కార్యక్రమాలలో ఎక్కువగా కుప్పి గంతుల వంటి నృత్యాలు, అసభ్య, ద్వందర్ధాలతో పాటలు, అప హాస్య నాటికలు వేస్తూ – బంగారు భావిస్త్యత్తు గల మన తెలుగు పిల్లలని తప్పు దోవ పట్టిస్తున్నారు. ఈ వ్యవస్థ మారాలి, మన తెలుగు తల్లి ని వదలి కొన్ని వేల మైళ్ళ దూరమున్న తెలుగు వారికి – మన జాతి విశిష్టత, ఔన్నత్యం తెలుగు భాష తియ్య దనాన్ని తెలిపే కార్యాలను చేపట్టాలి. ముందు తరం యువతకి మన తెలుగు జాతి లో ఉన్న అత్యంత విలువలను, ఆత్మీయత అనుబంధాలను తెలిపే అంశాలను తెలియ జేయు కార్య క్రమాలు చేపట్టాలి . తమ పదవీ దాహం, స్వార్ధ చింతన కట్టి పెట్టి – సమిష్టి తెలుగు వారి ఔన్నత్యానికి పాటు పడాలి.

  రఘు విస్సంరాజు

 4. మల్లికేశ్వరరావుగారి విదేశాలలో తెలుగెందుకు అనే అంశంపై రాసిన విషయాలు తెలుగువారందరినీ ఆలోచింపచేస్తాయి. వారి సమాధానాలు తర్కబద్ధంగానూ హేతుబద్ధంగానూ ఉన్నాయి. ఇప్పటివరకూ
  ప్రపంచమంతటా వ్యాపించిన భాషలు (ఇంగ్లీషు, ఫ్రెంచి, స్పానిషు, పోర్చుగీసు, జర్మను, జాపనీసు,
  చైనీసు మొ.) ఒకప్పటి వలసవాద రాజకీయాలద్వారా అభివృద్ధిచెందినవే. ఆనాటి వలసరాజకీయాలు స్థానికులపై దాడి దండయాత్రలతో సాగగా ఆధునిక భాషలవ్యాప్తి స్థానికుల అవసరాలమేరకు వారి అనుమతితో సాగుతోంది. ఈ ప్రయత్నంలో మనభాషలను వదిలివేయాల్సిన అవసరం లేదు. పూర్వం రకరకాల భాషలను సమాచార వినిమయానికి అడ్డంకి అనుకొనేవారు. అయితే కంప్యూటరూ, అంతర్జాల యుగంలో వివిధ మాండలికాలూ భాషలనూ ఒక్కమీట పోటుతో మార్చుకొనే రోజులు వచ్చాయి.. అందుకని మన మాతృభాష మనదిగానే ఉండొచ్చు పనినిబట్టి వేరొక భాషను నేర్చుకోవచ్చు. భాషలమధ్య అంతరాలను అధిగమించవచ్చు. మాతృభాష మనకు ఇతరులతో మాట్లాడడానికి జంకు, మొహమాటాన్ని దరికి చేరనీయక ధైర్యసాహసాల్ని అందిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎంత ఎత్తుకు ఎ(ది)గి(రి)నా ఎంత దూరం ఏగినా గాలిపటాలకు దారం లా మనల్ని మనగూటికి కట్టిపడేసి ఉంచేదే మాతృభాష.
  గా.ఉమామహేశ్వరరావు

Send a Comment

Your email address will not be published.