సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగుమల్లి పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. షుమారు మూడు పక్షాల విరామం తరువాత సంక్రాంతికి సరిక్రొత్త వార్తా విశేషాలతో అంగరంగ వైభోగంగా ముస్తాబై పదహారణాల పల్లె పడుచులా మీ ముందుకు వస్తున్న “తెలుగుమల్లి” కి సాదరభిమానంతో ఎప్పటిలాగే స్వాగతం పలుకుతారని ఆశిస్తున్నాము.

ఈ వేసవిలో చాలామంది విహార యాత్రలకు వెళ్ళడం, ముఖ్యంగా భారతదేశంలో తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులను కలిసి ఉల్లాసవంతమైన సమయాన్ని గడిపి తిరిగి వచ్చియుంటారని తెలుగుమల్లి భావిస్తుంది. మీ అనుభవాలు – మీ ఊరి గురించి కానీ, హుద్ హుద్ తుఫాను బాధితుల గురించి కానీ, మీరు తారసపడిన మనుషుల గురించి కానీ సంఘటనల గురించి కానీ తెలుగుమల్లిలో ప్రచురించాలనుకుంటే ఈమెయిల్ ద్వారా పంపగోరుచున్నాము. మీ రచనలు ఆంగ్ల భాషలో కానీ తెలుగు భాషలో కానీ ఉండవచ్చు. ఈ వ్యాసాలు మన తెలుగువారికి స్పూర్తిదాయకం అవుతాయనే ఉద్దేశ్యంతోనే పాఠకులకు మనవి చేస్తున్నాము.

చిత్రపరిశ్రమకు తీరని లోటు
గత నెలరోజుల్లో మన సినీ పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు అస్తమయం కావడం దురదృష్టం. కె.బాలచందర్, గణేష్ పాత్రో, ఆహుతి ప్రసాద్, వి.బి.రాజేంద్ర ప్రసాద్ మొదలైన చిత్ర ప్రముఖులు వీరిలో వున్నారు. అంతకుమునుపు శ్రీ బాపు గారు స్వర్గస్తులవ్వడం తెలుగువారికి తీరని లోటు. వీరందరికీ తెలుగుమల్లి మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని పాఠకులందరి తరఫున కోరుకుంటుంది.

ఉగాది రచనల పోటీ
వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారు వచ్చే మన్మధ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఉత్తమ రచనల పోటీ ఏర్పాటు చేసారు. మరిన్ని వివరాలు తెలుగుమల్లిలో ప్రచురించబడ్డాయి. పోటీకి ఆఖరి తేదీ మార్చ్ 1, 2015. ఆస్ట్రేలియాలో ఎంతోమంది భాషాభిమానులు, కధా రచయితలు, కవులు వున్నారని కవితాస్త్రాలయ పుస్తక ప్రచురణ ద్వారా రుజువు చేసారు. మళ్ళీ మీ కలాలకు పదును పెట్టి ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొనాలని తెలుగుమల్లి మనవి చేస్తుంది.

మురళి ముషాయిరా – రెండవ భాగం
భువన విజయ సభ్యులు, ముషాయిరీల మురళిగా ప్రసిధ్ధి గాంచిన శ్రీ మురళి ధర్మపురి గారు తమ రెండవ పుస్తక ఆవిష్కరణ ఈ నెల 31 వ తేదీన హైదరాబాదు లోని సారస్వత కళా పరిషత్ లో జరగనున్నది. వారి మొదటి పుస్తకం సిడ్నీలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవంలో ఆవిష్కరించడం జరిగింది. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా వారి ప్రచురణ మూడు భాషల్లో అందరికీ అర్ధమయ్యేటట్లు సరస సాహితీ సంభాషణలతో మృదుమధురంగా వుంటాయి. భువన విజయం మరియు తెలుగుమల్లి ఈ కార్యక్రమం విజయోత్సాహంతో జరగాలని అభిలషిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.