సంయమనం పాటించాలి

ఎన్నో ఏళ్ళ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో తెలంగాణా పేరిట కొత్త కొత్త సంఘాలు ఏర్పడడం మనందరికీ తెలిసిందే. ఇది ఊహించిన విషయమే.

తెలంగాణా ప్రజల 60 ఏళ్ల ఎదురు చూపులు, వారు కన్న కలలు ఫలించిన మాట వాస్తవం. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను తలచుకొని అశ్రుతర్పణం చేయాలన్న ఆవేశం తెలంగాణాలోని అన్ని వర్గాలలో ఉండి తీరాలి. ఇక్కడున్న తెలుగువారిలో చాలా మంది ఈ అమర వీరులకు వారసులే. చిన్నతనంలో ఎప్పుడో నాయనమ్మ ఒడిలోనో, అమ్మమ్మ ఒడిలోనో నిద్రపోతూ ఆవేశ పూరితమైన తాత ముత్తాతల వీరగాధల్ని వినడమో లేక చదవడమో జరిగే ఉంటుంది. దీర్ఘకాలంగా తమలో ఇమిడి ఉన్న ఈ మనోద్వేగాన్ని బయటకు తీయడం ఎంతో అవసరం.

అయితే సమయమాసన్నమైనదని ఒకరికొకరు దెప్పిపొడుచుకోవడం, ఆగ్రహావేశాలు వెల్లగక్కడం, ప్రాంతీయ విభేదాలను తీసుకురావడం, రెచ్చగొట్టే మాటలతో దూషణలాడడం, పరుష పదజాలాలను వాడడం ఎంత మాత్రం తగదు. తమలోని నిద్రావస్థలో ఉన్న నిగ్రహ శక్తిని తట్టి లేపి సంయమనంతో మాటలను ఆచి తూచి వాడడం ఎంతో అవసరం.

“మాట జారినా కాలు జారినా తిరిగి తీసుకోలేము” అన్న మన నానుడి అందరికీ తెలిసిన విషయమే. ఎదుటి మనిషి మాట తీరు వారి వ్యక్తిత్వాన్ని చెబుతుంది. ప్రతీ మాట మనసుకు హత్తుకుంటుంది. మనసును నొప్పించే మాటలు కలకాలం మదిలో ఉండిపోయి మనసులను, మనుషులను దూరం చేస్తాయి. కొన్ని వేల మైళ్ళ దూరం వచ్చిన మనకు మనమే చుట్టాలం, బంధువులం, హితులం, సన్నిహితులం, స్నేహితులం, శ్రేయోభిలాషులం. దేశ పరిధులకు స్వస్తి చెప్పి సంబంధ బాంధవ్యాలు ఏర్పడి కొన్ని జీవితాలు ముడిపడ్డాయి. ఇంతటి ఔన్నత్యం గల సంస్కృతీ సంప్రదాయాలకు వారసులమైన మనం మనలో లేని కొత్త ప్రాంతీయ విభేదాలను సృష్టించుకొని దూరం అవడం అవసరమా?

ఇదే కాకుండా మన తరువాత తరం వారికి మనం ఏమందిస్తున్నామన్నది కూడా ముఖ్యం. ఇప్పుడు కాకపోయినా ఇంకా పదేళ్ళలో మన తెలుగు సంఘాల సారధ్య బాధ్యతలు క్రొత్త తరం చేపట్టక తప్పదు. వారికి ఈ ప్రాంతీయ విబేధాలు అర్ధం కావు, అర్ధం చేసుకోవడానికి సమయమూ ఉండదు. ఇక్కడ పుట్టి పెరిగిన వారికి మన సంస్కృతీ సాంప్రదాయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి వుండి భారతీయులందరూ, తెలుగు వాళ్ళందరూ కలిసి ముందుకెళ్లాలన్న తపన వుంటుంది. ఇంతటి మహోన్నతమైన భావానికి ఎంతో గట్టి పునాదులు అవసరం. ఈ సదవకాశం కోల్పోకుండా ముందడుగు వేస్తే భవిష్యత్తు దిగ్విజయంగా వుంటుంది.

భారత దేశంలో రెండు రాష్ట్రాల ప్రజలు, నాయకులు తమ తమ రాష్ట్రాలను పునఃనిర్మాణంలో నిమగ్నమై ముందడుగు వేయాలన్న తలంపుతో అప్పుడే భావి కార్యక్రమాలకు వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇదే పంథాలోనే మనం కూడా వ్యక్తిగతంగా గానీ, ప్రాంతీయ ధోరణిలో గానీ ఒకరి నొకరు దూషించుకోకుండా కర్తవ్య నిర్వహణలో లగ్నమై చేదోడు వాదోడుగా వుంటే యోగ్యులుగానే మిగిలిపోతాం.

1 Comment

  1. పుట్టిన దేశం విడచి పెట్టి ఇంత దూరం పురోగతి చెందుదామని వచ్చిన మనమందరం ఒకరి కొకరు తోడు గా ఉండాలి కాని వలస వచ్చిన ఈ దేశం లో మనకి ఏ రకం గానూ ఉపయోగ పడని (ఉపయోగ పడక పోగా హాని కలిగించే) రాజకీయాలకు బానిసలమై నవ్వుల పాలు కాకూడదు. యేసు ప్రభువు ఉపదేశం – నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు – అనేది మరచి పోకూడదు.

Send a Comment

Your email address will not be published.