సాహితీ ప్రయాణంలో ఒక వసంతం

తెలుగుమల్లి తెలుగుతల్లి సేవలో ఒక వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠక మహాశయులకు, ప్రకటన కర్తలకు, రచయితలకు, కవులకు సుమనస్సుతో శుభాభినందనలు తెలుపుకుంటుంది.  ఈ సమున్నత సాహితీ ప్రయాణంలో తెలుగుమల్లికి చేయూతనిచ్చి భుజం తట్టి భళీ అని మాపై అపార నమ్మకాన్నుంచిన ప్రతీ తెలుగు వారికి శత సహస్ర వందనాలు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని తెలుగువారి సమాచారం, సాంస్కృతిక కార్యక్రమాలు, వారి జీవన పద్ధతులు, సాహితీ సువనంలో సుకవితల ధారలు, కధలు, కధానికలు ఇంకా ఎన్నో విశేషాలతో పాటు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల సమాచారం అందిస్తూ “తెలుగుమల్లి” మొదటి వార్షికం పూర్తి చేసుకుంది.

ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే ఎన్నో ఏళ్లుగా తెలంగాణా ప్రజల మనోభీష్టమైన స్వరాష్ట్రం గత ఏడాదిలోనే ఆవిర్భవించడం.  ఈ కారణంగా ఇక్కడి తెలుగువాళ్ళు కూడా ఇంచుమించుగా అన్ని ముఖ్య నగరాల్లో ప్రత్యేక తెలంగాణా సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.  అయితే అందరూ తెలుగు వారిగా భాషా సంస్కృతులకు ప్రాముఖ్యతనిస్తూ ముందుకు సాగడం ఎంతో ముదావహం.

ఎన్నో తెలుగు సంఘాలు వారి వారి పరిధుల్లో తెలుగు బడులను ప్రారంభించడం తెలుగు భాషా సంస్కృతులను మన పిల్లలకు అందివ్వాలన్న తపన కనబరచడం మనవారిలో వున్న నిబద్ధతకు తార్కాణం.

తెలుగు భాషను ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ లాంగ్వేజ్ గా గుర్తింపు పొందడానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం కేంద్ర పార్లమెంటరీ కార్యదర్శితో సమావేశ సన్నాహాలు జరగడంలో తెలుగుమల్లి కీలక పాత్ర వహిస్తుండడం గత ఏడాదిలో తెలుగు వారి చరిత్రలో మైలు రాయి.  అన్ని తెలుగు సంఘాలు ఈ మహత్తర ఘట్టానికి తగిన సహకారాన్నందించి చేయూతనివ్వాలని తెలుగుమల్లి కోరుకుంటుంది.

అందరమూ కలిసికట్టుగా భావితరాలకు బంగారు భవిష్యత్తుని అందివ్వగలమన్న ధృడ సంకల్పంతో ముందుకు సాగుదాం. ఎప్పటిలాగే మీ సహాయ సహకారలందిస్తారని ఆసిస్తూ….

Send a Comment

Your email address will not be published.