సాహితీ యాత్రకు సమర శంఖారావం

2018వ సంవత్సరం ఆస్ట్రేలేసియా ప్రాంతంలో సాహితీ యాత్రకు  శ్రీకారం చుడితే ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాలలో నివసిస్తున్న తెలుగువారి సాహితీ సమాలోచనలకు శంఖారావమై ‘తొలిసంధ్య’ గా వెలిగి ప్రతీ ఏటా ఒక పండగలా జరుపుకోవాలన్న ఆకాంక్షకు బీజం వేసింది.  దీని ఫలితమే ఈ సంవత్సరం నవంబరు నెలలో న్యూ జిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో మొదటి సాహితీ సమావేశం.

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో తెలుగు వారు తెల్లజాతి సంస్కరణల అమలుకు పూర్వమే వచ్చి నిబద్ధతతో తమ జీవన యానాన్ని సాగించి స్థానిక జనజీవన స్రవంతిలో భాగమయ్యారు.  సుమారు 60 ఏళ్ల అలుపెరుగని ప్రయాణం.  నలభై ఏళ్ల క్రితం వచ్చినవారికి ఎవరిని అడిగినా ఒక పుస్తకం వ్రాయడానికి సరిపడే ఎన్నెన్నో కథలు, కధనాలు, అనుభవాలు, అనుభూతులు.

చింతపండు దొరక్క వెనిగర్ వాడిన రోజుల నుండి ఇప్పుడు ఏ వీధి చూసినా ఒక భారతీయ సరకుల దుకాణం వరకూ వచ్చాం.  అయితే చింతపండు దొరకలేదని బాధ పడకుండా ఉన్నదానితో తృప్తి చెందుతూ చాలామంది తమకు తోచిన విధంగా మన తెలుగువారి అభివృద్ధికి తోడ్పడ్డారంటే అతిశయోక్తి కాదు.  సాహిత్యంలోనూ, రంగస్థల నాటకాలలోనూ, రేడియో కార్యక్రమాలు నిర్వహించడం లోనూ, తెలుగు బడులు నిర్వహించడంలోనూ, వివిధ పత్రికలు ప్రచురించడంలోనూ – ఒకటేమిటి బహు విధాలుగా తెలుగు నుడికారాన్ని పోషించి సాహితీ సుగంధాలు అక్షర సుమాలుగా భావి తరాలవారికి అందించారు.

ఆస్ట్రేలియాలో తెలుగు కమ్యూనిటీ భాషగా గుర్తింపు పొందడానికి గత ఐదేళ్ళుగా సాగించిన పోరాటానికి ఈ సంవత్సరం National Accreditation Authority for Translators and Interpreters Ltd (NAATI) వారు గుర్తింపు దిశగా  తెలుగు భాషలో అనువాదకులు (Translators) మరియు భాష్యకారులు (Interpreters) కావాలని ప్రకటన చేయడం జరిగింది.  ఇది తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం.  ఈ ప్రక్రియలో క్రియాశీలక పాత్ర వహించిన శ్రీ కృష్ణ నడింపల్లి గారు అభినందనీయులు.  ఈ విజయాన్ని స్పూర్తిగా తీసుకొని న్యూ జిలాండ్ దేశంలో కూడా తెలుగు భాషను గుర్తించడానికి తగు చర్యలు చేపట్టాలని తెలుగుమల్లి అభిలషిస్తోంది.

తొలి రోజుల్లోని మధుర జ్ఞాపకాలు మలితరంతో పంచుకోవాలన్న పలువురి పెద్దల కోరికకు పెద్ద పీట వేసి చిన్న దేశమైనా వన్నె గల దేశంగా పేరు గాంచిన న్యూ జిలాండ్ దేశంలోని తెలుగు సంఘం ఈ సంవత్సరం మొదటి సాహితీ సమావేశం ఒక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబోతున్నది.  ఈ సదస్సుకు అనేకమంది అంతర్జాతీయ అతిథులు పాల్గొనడానికి తమ ఆసక్తిని వెల్లడించారు.

ఈ సదస్సులో అన్ని తెలుగు సంఘాలు పాలుపంచుకొని మన తెలుగు భాషా సంస్కృతులను పరిఢవింప జేయాలని తెలుగుమల్లి మనవి చేసుకుంటోంది.  పాల్గొనదలచినవారు న్యూ జిలాండ్ తెలుగు సంఘ అధ్యక్షులను లేక కార్యదర్శిని సంప్రదించవచ్చు.

Scroll to Top