సాహితీ సువనంలో రెండు వసంతాలు

వెన్న మీగడలనుతీపి  కన్న మిన్న
 భాష యన్నదె మనమధ్య   పాశమన్న
 పసిడి కంటెను విలువైన భాష రన్న
 గుండె సప్పుళ్ళ కునికున్న  గుట్టురన్న
దివ్యమైనటి మనమాట శ్రావ్య మనుము
 యితర దేశమె  మెచ్చిన యింపు గనుము
 ప్రాక్ప్ర పంచపిటాలియ  ప్రథయె సుమ్ము
 అమ్మభాషకు సరిలేదు నవనిలెమ్ము
మన భాష గురించి ఎంత వ్రాసినా తక్కువే.  సంస్కృత భాషతో సమాంతరమైన భాష,  చరిత్ర పుటల్లో మహోత్కృష్టమైన స్థానాన్ని సంపాదించుకుని కొన్ని శతాబ్దాలు ఎవరి ఆదరణకూ నోచుకోకపోయినా తన స్వశక్తిపై నమ్మకంతో ముందడుగు వేస్తూ ప్రయాణం సాగించిన అమ్మ భాషకు దేశ విదేశాల్లో పట్టం కడుతున్న భాషాభిమనులందరికీ తెలుగుమల్లి హృదయపూర్వకంగా వినమ్ర ప్రణామములు తెలియజేసుకుంటుంది.
తెలుగు భాష మల్లె పూవులా సువాసనలు వెదజల్లుతూ బహుళ సంస్కృతీ సంప్రదాయాలకు పట్టంగట్టే  పరదేశీయుల చేత  కూడా గుర్తింపు పొందిన మన అమ్మ భాష మహోజ్వలమైన తారా పథానికి ఎదగాలని “తెలుగుమల్లి” పలువురి భాషాభిమానుల సహకారంతో తనదైన శైలిలో ముందుకెల్తోంది.  మన భాష ఆస్ట్రేలియా ప్రభుత్వంచే కమ్యూనిటీ భాషగా గుర్తింపు పొందడానికి చేసిన కృషిలో “తెలుగుమల్లి” ప్రముఖ పాత్ర వహించిందని చెప్పడానికి సంతోషంగా వుంది.
గత రెండేళ్లలో ఎన్నెన్నో కవితలు, కధనాలు, పాటలు, పద్యాలు, చారిత్రాత్మక ఘట్టాలతో పాటు పాఠకుల అంతరంగాలకు అద్దం పట్టే తెలుగు వంటకాలు, సంపాదకీయాలు, ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లో మన తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమ విశేషాలు – ఇలా ఎన్నో విశేషాలు ప్రచురించడం జరిగింది. ఈ సాహితీ యాత్రలో  సహకరించిన రచయితలు, కవి దిగ్గజాలు, భాషాభిమానులు అందరికీ వందనాలు.   
“తెలుగుమల్లి” మరియు “భువన విజయం” నిర్వహించిన “తెలుగు కళాతోరణం” కార్యక్రమం అద్వితీయమని ఆనాటి ముఖ్య అతిధి శ్రీ తనికెళ్ళ భరణి గారు ఘంటాపధంగా చెప్పారు.  వెయ్యేళ్ళ తెలుగు భాష చరిత్ర ఒక గంటలో ప్రదర్శించిన తీరు ఆ కార్యక్రమాన్ని సమాలోచనతో పొందుపరచిన  పధ్ధతి అనిర్వచనీయం.  ఈ కార్యక్రమంలో భుఅవన విజయం రెండవ ప్రచురణ “కవితాస్త్రాలయ – 2014” పుస్తకాన్ని  శ్రీ తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా అవిష్కరించబడడం ఆస్ట్రేలియా తెలుగువారి 50 ఏళ్ల ప్రస్థానంలో చరిత్రాత్మకమైన మైలు రాయి.  
“తెలుగుమల్లి” తన సంపాదకీయంలో ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ దేశాలలో నివసించే తెలుగువారి మనోభావాలకు అద్దంపట్టే సంపాదకీయాలు గత రెండు సంవత్సరాలలో ప్రతీ నెలా ప్రచురించే న్యూస్ లెటర్ లో వ్రాసి పలువురి మన్నలను పొందింది.  కొన్ని ఉదాహరణకి:  విదేశాలలో తెలుగెందుకు?     తెలుగువారిగానే వుందాం   2020 లో మన పరిస్థితేమిటి  సంయమనం పాటించాలి
కొందరు తెలుగువారు వ్యక్తిగతంగా ఎంతో ఎత్తుకి ఎదిగి మన తెలుగువారి మట్టి సువాసనలు పరాయి గడ్డపై పలుదిశలా పరిమళింపజేసారు.  సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి మన సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెప్పారు. సాధ్యమైనంతవరకూ  ఇక్కడి తెలుగు వారు నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమాన్ని ప్రచురించి “తెలుగుమల్లి”  తెలుగువారి ఆదరాభిమానాలను పొంది ఇంటింటా “మన మల్లి” అంటూ ప్రాచుర్యం పొందింది.  ఈ ప్రక్రియలో భాగస్తులై సహాయసహకారాలందించిన  ప్రతీ ఒక్కరికీ “తెలుగుమల్లి”  కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
భాషే ఆయుధంగా సంస్కృతే మూలంగా కాన్బెర్రా, సిడ్నీ మరియు బ్రిస్బేన్ నగరాల్లో ఔత్సాహికులైన కొంతమంది మన తెలుగువారు రేడియో కార్యక్రమాలను నడుపుతున్నారు.  ఉన్నతమైన ఆశయాలు కలిగి మన సినిమాలు, మన వైభవాలు, మన జాతీయాలు, మన కవులు, మన గాయకులు, మన రచయితలు  - ఇలా ఎన్నో వైవిధ్యమున్న వివిధ విషయాలపై కూలంకుషంగా ప్రతీ వారం మంచి కార్యక్రమాలను ప్రసారం చేసి మాధ్యమాలుగా పనిచేస్తున్నారు.  వారందరితో “తెలుగుమల్లి” కలిసి పని చేస్తుంది.  ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆయా సంస్థలకు తెలుగుమల్లి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.  ఇకముందు కూడా భాషాపరంగా పనిచేసే వ్యక్తులకు గానీ సంస్థలకు గానీ “తెలుగుమల్లి” సహృదయంతో తన హస్తాన్ని అందిస్తుందని తెలుపుకున్తున్నాము.
తెలుగు భాష కున్న ప్రత్యెక ప్రక్రియ ఛందోబద్ధమైన పద్యాలు.  “తెలుగుమల్లి” అనుబంధ సంస్థ “భువన విజయం” సభ్యులు తమ భాషాభిమానాన్ని చాటుకోవడానికి ఈ సంవత్సరం మరో మెట్టు ఎక్కుతున్నారు.   ప్రతీ సభ్యుడు మన భాషకున్న చారిత్రాత్మక విలువలతో పాటు ఎన్నెన్నో ఇతర సంస్థలు చేస్తున్న కృషిని, ప్రాచీన కవుల చేసిన కృషిని ఛందోబద్ధమైన పద్య రూపంలో తదుపరి ప్రచురణను ముద్రించాలని ప్రణాళికా బద్ధంగా పనిచేయడం ముదావహం.

Send a Comment

Your email address will not be published.