స్పూర్తినిచ్చిన ప్రపంచ తెలుగు మహా సభలు

భారతదేశంలో జాతీయ భాష హిందీ తరువాత ఎక్కువ సంఖ్యలో మాట్లాడే భాష తెలుగన్నది నిర్వివాదాంశం. ప్రపంచ వ్యాప్తంగా షుమారు 18 కోట్ల మందికి పైగా తెలుగులో మాట్లడేవారున్నారు. అజంత భాషగా, సంగీతాత్మక భాషగా, ఉత్కృష్టమైన వారసత్వ భాషగా తెలుగు ప్రసిద్ధి గాంచింది.

“దివ్యమైనది మా మాట పలుకరో నీ నోట
పరదేశీయులు కూడా కడుమేచ్చేనంట
‘ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్’ గా పెరుగాంచెనట
అమ్మ భాషను మించినది అవనిలో లేదంట”

తెలుగు భాష క్రీస్తు శకానికి 2000 సంవత్సరాల క్రితమే తెలుగుఠీవి దిగ్మోహనంగా తన కాంతులను ప్రసరింప జేసిందనడానికి ప్రబల సాక్ష్యాలు, నిదర్శనాలు ఉన్నాయి. తెలుగు భాష అత్యంత ప్రాచీనతను చాటిచెప్పే చారిత్రిక శాసనాలు, కట్టడాలు, తాళపత్ర గ్రంధాలు అనేకం లభ్యమయ్యాయి. పదవ శతాబ్దం వరకూ అక్కడక్కడా ఆధారాలు లభించినా తరువాత కాలంలో ఒక మహోత్క్రుష్టమైన స్థానాన్ని అందుకొని ప్రజల నాలుకల్లో తాండవం చేసి అజరామరంగా నిలచింది. ఇంతటి స్థానాన్ని పొందడానికి ఎంతోమంది కవులు, రాజులు, ఆస్థానాలు తమవంతు కృషి చేసారు.

గత వెయ్యి సంవత్సరాలుగా తెలుగు భాషకు సేవ చేసిన కవులు, పరిశోధకులు అందరి పేర్లు వ్రాయాలంటే అది మరొక గ్రంధం అవుతుంది. చరిత్రలో వెయ్యి సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. అయితే ఈ కాలంలో ఎంతటి పటిష్టమైన సంస్థ గానీ మతం గానీ ఒడుదుడుకులకు లోను కాక తప్పదు. తెలుగు భాష కూడా కొన్ని శతాబ్దాలలో ముఖ్యంగా 17 – 18 శతాబ్దాలలో ఆదరణకు నోచుకోక మన్ననకొరవడి చిన్నబోయింది. తరువాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పుణ్యమా అని మళ్ళీ జీవం పోసుకొని రెండు శతాబ్దాలు ఉత్తుంగ తరంగమై ఎగిసింది.

UNESCO వారి అధ్యయనం ప్రకారం ప్రతీ 14 రోజులకు ప్రపంచంలో ఒక భాష అంతరించిపోతుంది. ప్రపంచీకరణలో భాగంగా ప్రాశ్చాత్య భాషల ప్రభావం వలన మాతృ భాషకు తగిన ఆదరణ లేక కొన్ని భాషలు అంతమొందుతున్నాయి. ఇందులో 18 కోట్లమంది మాట్లాడే తెలుగు కూడా ఉండడం మన దురదృష్టం. భాషా ప్రాతిపదికపై ఏర్పడిన ఒక ప్రత్యేక రాష్ట్రం ఆ భాషనే ఆదరించకపోవడం దీనికి కారణం అని వేరే చెప్పక్కర్లేదు.

మన భాషలోని ప్రక్రియలు ముఖ్యంగా పద్యాలూ, అవధానాలు మనకే స్వంతం. ఇతర భాషలు మాట్లాడేవారు, ప్రాశ్చాత్య దేశస్తులు మన భాషను కొనియాడిన సందర్భాలున్నాయి. ఉద్యోగానికి ఇంగ్లాండ్ నుండి వచ్చి తన జీవితాన్నే మన భాష ఎదుగుదలకోసం అంకితం చేసిన సిపి బ్రౌన్ లాంటి వారు లేకుంటే ఈ సరికి మన భాష గతి ఎలా ఉండేదో చెప్పలేం.

తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాల్లో తెలంగాణా ముందుగా భాషా పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టింది. రెండు నెలల క్రితం 1 నుండి 12వ తరగతి వరకూ వచ్చే విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా తెలుగు పాఠ్యాంశముగా ప్రతీ బడిలోనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలుగు పండితులకు ప్రోత్సాహకంగా తగిన ఉత్తర్వులు జారీ చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన మూడేళ్ళలోనే ప్రపంచ మహాసభలు నిర్వహించి తెలుగు ప్రాభవాన్ని ప్రపంచ పటంలో చాటి చెప్పింది. స్వతహాగా కవి, సాహితీ ప్రియుడు అయిన తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ, తెలుగును జీవభాషగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక ముందు తెలంగాణా తెలుగు మహాసభలు ప్రతి డిసెంబరులో రెండు రోజులపాటు నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్భోచితంగా పాడిన పద్యాలు ఈ సభలకు వన్నె తెచ్చాయి. ప్రవాస తెలుగువారికోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి తెలంగాణాలో జరుగుతున్న భాషాభివృద్ధి మరియు ఇతర సామజిక సేవా కార్యక్రమాలు విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారందరికీ తెలియజేయాలని అభ్యర్ధించారు.

ఈ ప్రపంచ మహాసభల ప్రారంభోత్సవం తెలుగువాడైన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా జరిగింది. ముగింపు సభకు రాష్ట్రపతి శ్రీ రామనాధ్ కోవింద్ వచ్చారు.

సాహితీ గోష్టులు, కవి సమ్మేళనాలు, శతావధానంతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహూతులను ఆకట్టుకున్నాయి.

సభలలో భాగంగా నాలుగు రోజులపాటు డాక్టర్ జీఎం. రామశర్మ శతావధానం నిర్వహించారు. ఈ అవధానం కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది.

42 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సభలకు ప్రతిరోజూ కనీసం ముప్పయి వేల మందికి పైగా తరలివచ్చినట్టు అంచనా. 1,500 మంది కవులు, 500 మంది రచయితలు పాల్గొన్నారు. వందసదస్సులు నిర్వహించారు. ఈ సభలు పురస్కరించుకుని 250 కొత్త పుస్తకాలు, భాషా ప్రక్రియలపై 10 సీడీలు, 10 ప్రత్యేక సంచికలు ఆవిష్కరించినట్టు తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి ప్రకటించారు. మున్ముందు జరిగే సదస్సులకు ఈ సభలు మార్గదర్శక ముద్ర వేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సభలతో సగటు భాషాభిమానులంతా తెలుగుకు మరింతగా జవసత్వాలు కల్పించే దిశగా నడుంబిగించి ముందుకు కదలివస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రవాసంలో వున్న తెలుగువారు కూడా ఈ ప్రపంచ మహాసభల ఆశయాలను స్పూర్తిదాయకంగా స్వీకరించి తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. భావి తరాలకు మన భాషను అందించే దిశగా ముందడుగు వేయాలి. భాషాభిమానులను, కళాభిమానులను ప్రోత్సహించాలి. తెలుగుదనం ఉట్టిపడే కార్యక్రమాలను నిర్వహించాలి.

Signature RAO

Send a Comment

Your email address will not be published.