హేవళంబి ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పండగ తెలుగువారికి ఎంతో ప్రాశస్త్యమైనది. మానవ జీవన సరళిని సమపాళ్ళలో ప్రతిబింబించి మతాతీతమైన పండగ ఉగాది అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఉగాది గురించి హిందూ పురాణాల్లోనూ కావ్యాల్లోనూ ఎన్నో కధలు ఉన్నాయి. అయితే ఉగాది ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేకించి ఏ దేవుడిని పూజించరు. కానీ పురాణాల్లో వెదికితే ఈ ఉగాది (యుగ + ఆది) యుగానికి ఆది అని నిర్వచించబడింది.

ఉగస్య ఆది ఉగాది: “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది అంటారు. ‘యుగము’ అనగా ద్వయము అని అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతము ‘యుగం’ (సంవత్సరం) కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయ్యింది.

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది ‘యుగాది’ ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

వేదాలను హరించి సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభ తరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం “ఉగాది” ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి.

చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మ దేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచుందని కూడా చెప్పబడుతుంది. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపజేసే శుభదినమే ‘ఉగాది’.

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు పండితుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అమ్కురార్పణం కావించవలెనని చెప్పబడియున్నది. ఉగాది నాటి పంచాంగ శ్రవణం వలన గంగానదిలో స్నానం చేస్తే లభించే అంత ఫలితం లభిస్తుందని పెద్దల అభిప్రాయం. కాలగమన ప్రమాణాలు తెలియాలని పంచాంగ శ్రవణం అవశ్యం అన్నారు పెద్దలు.

ఉగాది పేర్ల ప్రాసస్త్యత:
ఒక్కో సంవత్సరం, ఒక్కో పేరుతో ఉగాదిని పిలుస్తారు. ఇలా ఉగాదికే ఎందుకు ఈ ప్రత్యేకత ? ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చింది ? అంటే.. పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే.. ఈ తెలుగు సంవత్సరాలట. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో.. ప్రతి ఉగాదికి అవే పేర్లుగా మారిపోయాయి. ప్రతీ సంవత్సర పేరు వెనుక ఒక అర్ధం వుంది. ఈ ఏడాది వస్తున్న ఉగాది పేరు హేవళంబి నామ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రజలందరూ ఆనందంగా ఉంటారని ఉవాచ.

ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు జరపుకోవాలన్న మీమాంస వుంది. పండితులందరూ కలిసి బుధవారం 29 వ తేదీన జరుపుకోవలన్నట్లు నిర్ణయించడం జరిగింది.

Send a Comment

Your email address will not be published.