2014 - సింహావలోకనం

ముందుగా అందరికీ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఆస్ట్రేలియా న్యూ జిలాండ్ తెలుగు వారు 2014 సంవత్సరంలో ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని మధురస్మృతులు, ఎన్నెన్ని మధురానుభూతులు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడడం వలన తెలుగుతల్లికి నీరాజనం పట్టే వాళ్ళు రెండింతలు అయ్యారనడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండగ మొదలుకొని మొన్నటి దసరా, దీపావళి, బతుకమ్మ పండగల వరకు షుమారుగా ప్రతీ నెల ఏదో ఒక మూల పండగ సంబరాలు జరుపుకుంటూ పరదేశంలో మన సంస్కృతీ సంప్రదాయాలు గగన తలానికి ఎగురవేసారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి భారతదేశం నుండి ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు ఎంతో క్రమశిక్షణతో కూడినవని ప్రశంసలు అందజేసారు. వీరిలో ప్రముఖులు కవి, నటుడు, దర్శకుడు, గాయకుడు మరియు తత్వవేత్త శ్రీ తనికెళ్ళ భరణి గారని చెప్పడంలో సందేహం లేదు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలికి గౌరవపూర్వకంగా భువన విజయ సభ్యులు “తెలుగు కళా తోరణం” కార్యక్రమాన్ని నిర్వహించి అందులో భాగంగా “కవితాస్త్రాలయ – 2014” పుస్తకాన్ని ఆవిష్కరింప జేయడం ఎంతో కొనియాడదగింది. ప్రముఖ అంతర్జాతీయ అంతర్జాల మాస పత్రిక “కౌముది” లో ఈ నెల పుస్తక సమీక్ష శీర్షికన ఈ గ్రంధం గురించి వ్రాయబడింది.

ఎన్నో తెలంగాణా సంఘాలు దసరా సంబరాలు సందర్భంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ గేయ రచయిత శ్రీ చంద్ర బోస్ గారు, తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభ్యులు శ్రీ రసమయి బాలకృష్ణ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ కర్నే ప్రభాకర్ గారు కూడా వున్నారు. మెల్బోర్న్ లోని ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు గత నెల 15 వ తేదీన నిర్వహించిన గీతాంజలి కార్యక్రమానికి శ్రీమతి గీతా మాధురి మరియు శ్రీ నందు గారు కూడా వచ్చి మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాల్లో వున్న తెలుగువారిని అలరించారు. ఈ కార్యక్రమాలు ప్రత్యేకంగా “హూద్ హూద్” తుఫాను బాధితుల సహాయం కోసం నిధులు సమకూర్చడానికి నిర్వహించారు.

తెలుగు వారి కాల భ్రమణంలో మరొక సంవత్సర కాలం చరిత్రలో కలిసిపోయింది. అందరూ వేసవి సెలవులకని ఎన్నో సందర్శనా స్థలాలకు వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా భారతదేశం వెళ్ళడానికి సన్నాహాలు చేసుకునేవాళ్ళు అందరికీ తెలుగుమల్లి తరఫున శుభాసీస్సులు తెలుపుకుంటూ లబ్దప్రతులై రాగలరని ఆశిస్తున్నాము. ఈ సెలవు దినాలు మీ అందరికీ అత్యంత ఉల్లాసాన్ని మరియు ఉత్సాహాన్నిచ్చి వచ్చే ఏడాది (2015) మరిన్ని మంచి నిర్ణయాలను తీసుకునేందుకు ప్రోత్సహించగలదని ఆశిస్తున్నాము.

Send a Comment

Your email address will not be published.