2016 – తెలుగువారికి అవార్డుల శోభ

చరిత్ర పుటల్లో మరో సంవత్సరం. తెలుగువారి ప్రతిభకు నిలువుటద్దం. నెమరువేసుకోవడానికి సమున్నతం. నిత్యనూతనత్వానికి నిండుదనం. అలుపెరుగని ప్రయాణం. సమాజసేవలో సాత్వికం. తెలుగు దివ్వెలకు వెలుగు పతాకం.

ఆస్ట్రేలియాలో వివిధ రంగాల్లో సమాజ సేవలందించిన తెలుగువారికి 2016వ సంవత్సరం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ సంవత్సరం సేవా దృక్పధంతో తోటివారికి సహాయపడాలని, పర సంస్కృతితో మన సంస్కృతిని మమేకం చేయాలని, హిందూ ధర్మం ఒక జీవన విధానమనీ బహుళ సంస్కృతీ సాంప్రదాయంలో అరమరికలు లేకుండా ఇతిమిద్దంగా ఇమిడిపోతుందని చాటి చెప్పి జనజీవన స్రవంతిలో తమకంటూ ఒక ముద్రవేసుకున్న కొంతమంది వ్యక్తులు వారి సేవలకు పారితోషికంగా ఇక్కడి ప్రభుత్వ పరంగా మరియు ప్రవాస సంస్థలనుండి పురస్కారాలను అందుకున్నారు. వారందరి వివరాలు క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తున్నాము:

అవార్డు ఫర్ మెరిటోరియస్ సర్వీస్:
విక్టోరియా ప్రభుత్వం ప్రతీ ఏటా వివిధ విభాగాల్లో ఇచ్చే ముల్టీ కల్చరల్ అవార్డుల్లో ఈ సంవత్సరం మన తెలుగువారు ముగ్గురు ఉండడం విశేషం.

శ్రీమతి నీరజ మరియు కృష్ణ వేముల: షుమారు ముప్పయేళ్ళ క్రితం ఆస్ట్రేలియా దేశం వచ్చి తరతమ, క్రొత్త పాత భేదం లేకుండా తెలుగు వారందరికీ సుపరిచితులు. ప్రతీ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమవంతు సాయం అందిస్తూ సౌమ్యపరులైన దంపతులు శ్రీమతి నీరజ మరియు కృష్ణ వేముల. రంగస్థలంపైనే కాకుండా తెరవెనుక కూడా ధనుస్సు, బాణాలు, త్రిశూలం, కిరీటాలు, దండలు ఒకటేమిటి అడిగితే చాలు ప్రతీ సమస్యకు ఒక పరిష్కార మార్గం ఒనగూర్చే క్రిష్ణగారంటే తెలుగువారందరికీ నోటిలో నాలుకలాంటి వారు. వారికి సహధర్మచారిణిగా నృత్య గీతికల్లోనూ, కృష్ణ గోపికల్లోనూ, వెన్నెల విహరాల్లోనూ విరబూసిన సన్నజాజిలా ఎల్లప్పుడూ తోడుండే నీరజ గారు. అరవిరిసిన మందారంలా అన్యోన్య దాంపత్యం.

శ్రీమతి విజయ తంగిరాల: ఆస్ట్రేలియా తెలుగు సంఘానికి అనుబంధ సంస్థగా తెలుగు లేడీస్ క్లబ్ అనే సంస్థను పదిహేనేళ్ళ క్రితం స్థాపించి ప్రతీ సంవత్సరం వరుస తప్పకుండా స్థానిక సంస్థలు – కాన్సెర్ ఫౌండేషన్ అఫ్ ఆస్ట్రేలియా మరియు తదితర సంస్థలకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విరాళాలు సమకూర్చడమే కాకుండా స్త్రీల ఆరోగ్య మరియు గృహ హింస సమస్యలపై నిపుణలతో ప్రత్యెక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం విక్టోరియా ప్రభుత్వం అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. శ్రీమతి విజయ గారు ఆస్ట్రేలియా తెలుగు సంఘంలో పలు పదవులు చేపట్టి తమ సేవలనందించారు.

ప్రవాసి స్త్రీ శక్తి:
అమెరికా తెలంగాణా అసోసియేషన్ ప్రవాస మిత్ర వారి అనుబంధంతో ఇచ్చే అవార్డు

శ్రీమతి హైమ వుల్పాల: 20 ఏళ్ల క్రితం న్యూ జిలాండ్ దేశానికీ వలస వెళ్లి 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాకి వచ్చిన శ్రీమతి హైమారెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా వాసి. మన భాషపై మమకారంతో తెలుగులో పట్టభద్రురాలై ఇక్కడ ఎంతోమందికి తెలుగులో పట్టం గట్టాలన్న దీక్షతో ఒక తెలుగు బడిని నిర్వహిస్తున్నారు. అదే బాటలో ఇక్కడి స్థానికులకు మన సంస్కృతీ సంప్రదాయాలను గురించి తెలియజేయడానికి సంక్రాంతి పండగను ఏటా జరుపుతూ తెలుగు నుడికారాన్ని, మమకారాన్ని పంచిపడుతున్నారు. వనితల ప్రయోజనాలను కాపాడడానికి Find Yourself program అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బహుళ సంస్కృతీ సాంప్రదాయ విలువలను కాపాడుతూ మన వారందరినీ స్థానికులతో కలవడానికి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.
http://www.telugumalli.com/news/ రాజకీయాల్లోకి-అరంగేట్రం/

శ్రీమతి నందిని బిస్కుంద: 2008లో ఆస్ట్రేలియాలోని సుందర నగరం మెల్బోర్న్ చేరుకొని వచ్చిన క్రొత్తలో అందరిలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కొంత కష్టపడి, కష్టంలో కొన్ని మెలుకువలు నేర్చుకుని ప్రతీ మలుపుని గెలుపుగా మార్చుకొని క్రొత్తవారికి సహాయపడుతున్నారు శ్రీమతి నందిని. అంతేకాకుండా తెలంగాణా సాంప్రదాయ పండగ “బతుకమ్మ” మొదటిసారి కొంతమంది స్నేహితులతో కలిసి మెల్బోర్న్ లో జరపడానికి నాంది పలికిన వారు శ్రీమతి నందిని. తెలుగు, ఆంగ్ల భాషలతో పాటు హిందీ తమిళ భాషలు కూడా మాట్లాడగలగడం వలన చాలామంది తెలుగు రాష్ట్రేతరులకు కూడా సహాయం చేస్తుంటారు.
http://www.telugumalli.com/news/ సమాజ-సేవే-సాత్వికం/

ప్రవాసీ ఎక్సలెన్స్ :
కోఅలీషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) మరియు ప్రవాసీ మిత్ర సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాలు అందజేస్తారు.

శ్రీ ఆదిరెడ్డి యారా: శ్రీ ఆదిరెడ్డి గారు ఆస్ట్రేలియాలో అడుగిడి ఒక దశాబ్ద కాలం అయింది. వచ్చిన దగ్గరనుండి సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం తరఫున పదవి వున్నా లేకున్నా సమాజ సేవ చేస్తూ క్రొత్తగా వచ్చిన వారికి చేయూతనిస్తూ ముందుకు సాగిపోతున్నారు. రెండేళ్ళు సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షులుగా పనిచేసి ఇప్పుడు స్వర్నత్సవాలు జరుపుకోనున్న Indian Australian Association of SA – IAASA కు అధ్యక్షులుగా వున్నారు.
http://www.telugumalli.com/news/ తెలుగు-బిడ్డకు-స్వర్ణోత/

శ్రీ నాగేందర్ రెడ్డి కాసర్ల: కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీ నాగేందర్ రెడ్డి కాసర్ల గారు గత 13 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో స్థిరపడి ఆస్ట్రేలియాలో తెలంగాణ ఉద్యమం గురించి చేసిన కృషికి మరియు తాను నివసిస్తున్న మెల్బోర్న్ నగరంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆస్ట్రేలియా లో తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసేందుకు చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారానికి ఎన్నుకోబడ్డారు.

Send a Comment

Your email address will not be published.