2018 – సింహావలోకనం

ప్రపంచ సాహితీ సదస్సు

2017 డిశంబరు నెలలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల స్పూర్తి ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల్లోని తెలుగువారి మహర్దశకు  శ్రీకారం చుట్టింది. వంగూరి ఫౌండేషన్ మరియు లోక్ నాయక్ ఫౌండేషన్ వారు మెల్బోర్న్ నగరంలో ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారి సౌజన్యంతో  తమ 6వ ప్రపంచ సదస్సు నిర్వహించడం జరిగింది.  జాతీయ స్థాయిలో కూడా ఎప్పుడూ జరగని ఒక అంతర్జాతీయ సాహితీ సదస్సు మెల్బోర్న్ నగరంలో జరగడం, ఇక్కడి రెండు దేశాల భాషాభిమానులు కలుసుకొని వివిధ సాహితీ అంశాలపై చర్చించే అవకాశం దొరికింది.  అమెరికా, ఫ్రాన్స్, మారిషస్, సింగపూర్, మలేషియా మరియు భారతదేశం నుండి  షుమారు 60 మందికి పైగా అంతర్జాతీయ అతిధులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.  ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల నుండి 150 మంది సభ్యులు రావడం ఎంతో ముదావహం.  ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలోని తెలుగువారి  గత 6 దశాబ్దాల సంక్షిప్త చరిత్ర ప్రస్థానంగా  మెల్బోర్న్ లోని భువన విజయం మరియు తెలుగుమల్లి సంయుక్తంగా ప్రచురించిన  “కవితాస్త్రాలయ 2018” సంకలనం ఆవిష్కరించడం జరిగింది.

అష్టావధానం

ఆస్ట్రేలియాలో 21వ శతాబ్దంలో తొలిసారిగా జరిగిన అష్టావధానం.  ఇదొక సాహితీ విన్యాసం.  తెలుగు, సంస్కృతంలో కాకుండా మరే ఇతర భాషల్లో లేని ఒక ఉత్కృష్టమైన సమన్వయ సంతుష్టము.  అవధాని యొక్క ధారణా శక్తికి పాండితీ ప్రకర్షకు నిరుపమాన నిదర్శనం.  తెలుగు భాషా వాజ్మయంలో అసాధారణ అద్వితీయ సాహితీ పరిజ్ఞానం.  అష్టావధాని మరియు పండితులు శ్రీమాన్ మరింగంటి కులశేఖరాచార్యులు గారు మెల్బోర్న్ వాసులైన 8 మంది పృచ్చకులతో సెప్టెంబరు 22వ తేదీన అష్టావధానం నిర్వహించారు.

‘తెలుగుమల్లి’ పరిమళాలకు సాహితీ పురస్కారం

— మండలి వెంకట కృష్ణారావు సాహితీ పురస్కారం

ఐదేళ్ళు అలుపెరుగని ప్రయాణంలో ఎన్నో భాషాపరమైన వ్యాసాలు.  ముఖ్యంగా ‘మన’ తెలుగువారు ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో జరుపుకున్న కార్యక్రమాలు, ఎంతోమంది మన తెలుగు సంఘాలలో ఉన్నత శిఖరాలనధిరోహించి స్పూర్తిదాతలుగా నిలచిన వ్యక్తుల జీవిత విశేషాలు, తెలుగు సాహిత్యంలో స్థానిక భాషాభిమానులు వ్రాసిన కవితలు, కధలు, పద్యాలూ – ఇలా ఎన్నెన్నో విశేషాలతో తెలుగుమల్లి ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ తెలుగు వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసింది.

ఈ కృషిని గుర్తిస్తూ 2018 సంవత్సరానికి శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి అంతర్జాతీయ తెలుగు కేంద్రం  వారు ప్రతీ ఏటా ఇచ్చే శ్రీ మండలి వెంకట కృష్ణారావు ‘అంతర్జాతీయ సంస్కృతీ’ పురస్కారం తెలుగుమల్లికి ప్రదానం చేసారు.  ఆగష్టు 5వ తేదీన విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘అంతర్జాతీయ సంస్కృతీ’ పురస్కారం ప్రముఖ గాయని గాన సరస్వతి,  పద్మ భూషణ్  శ్రీమతి పి.సుశీల గారి చేతుల మీదుగా ప్రదానం చేయడమైనది.

మెల్బోర్న్ లో ‘తెలుగు మహా సభలు’

మెల్బోర్న్ తెలుగు సంఘం మొట్టమొదటి సారిగా ఎంతో ఘనంగా “తెలుగు మహాసభలు” నిర్వహించి తెలుగు భాషకు అందలం పట్టారు. అమృతతుల్యమైన అమ్మ భాష  కన్నవారు కాదన్నా నన్నాదరించేవారు నావారంటూ నాట్యం చేసింది.  ఈ కార్యక్రమానికి సినీ హాస్య నటులు డా. పద్మశ్రీ బ్రహ్మానందం గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు.  డా. కళారత్న మీగడ రామలింగేశ్వర స్వామి గారు తన నవావధానంతో ప్రేక్షుకులను మంత్రముగ్దులను చేసారు.

రెండు దశాబ్దాల చిరు ప్రాయం

దేశం చిన్నదైనా వన్నె గలది.  వాసికెక్కినది.  న్యూ జిలాండ్ కి పాతికేళ్ళ క్రితం అరకొరగా వున్న తెలుగువారు ఇప్పుడు ‘ఇంతింతై వటుడింతయై’ అన్నట్లు షుమారు పదివేలకు పైగా వున్నారు.  దేశానికంతటికీ తలమానికమైన ఆక్లాండ్ నగరంలో ఇరవై ఏళ్ల క్రితం 1998లో తొలి తెలుగు సంఘం ఏర్పడి ఇప్పటికి 20 సంవత్సరాలైంది.  ఈ ప్రయాణంలో ఎన్నెన్ని మార్పులు!  నూతన సరాగాలతో కాలంతో పాటు అనుకూల సమయంలో పరుగులిడి ప్రతికూల సమయంలో కాలాన్నే ఎదొర్కొని సంయమనంతో తన ఉనికిని కాపాడుకుంటూ సుస్థిరమైన స్థానాన్ని పదిలపరచుకుంది.

ఇప్పటికి ఇరవై ఉగాదుల పచ్చడి చవి చూసిన న్యూ జిలాండ్ తెలుగు సంఘం షడ్రుచుల లాగానే పోరాట పటిమ అలవరచుకొని జీవనసారాన్ని రసామృతంగా సభ్యులందరికీ పంచి ఇచ్చింది.  గెలుపు ఓటములు నాణేనికి రెండు వైపులా వున్న బొమ్మ బొరుసులని ఒక గుణపాఠం నేర్పింది. ‘బహుధాన్య’ ఉగాదికి మొదలైన తెలుగు సంఘం ‘విలంబి’కి ఒక వైవిధ్యమైన రీతిలో పరిణితి చెంది ప్రజా బాహుళ్యాన్ని కూడగట్టుకొని ఉరకలు వేస్తూ త్రోవనబోయే తెలుగువారందరికీ వయ్యారంగా పలకరిస్తుంది.  తన పలకరింపుతో పులకరింపజేస్తుంది. పరవసింపజేస్తుంది.

జాము రాతిరి జాబిలమ్మ

‘మానవా మానవా’ అంటూ ఒక దేవతా మూర్తిగానే మురిపిస్తూ అనంతలోకాలకు వెళ్ళిపోయిన సౌందర్యమూర్తి.  వైవిధ్యమున్నపాత్రలు ధరించి అత్యున్నత ప్రమాణాలకు పట్టంగట్టిన నటనా వైదేహి.  చంద్రుని తారా వలయంలో వెలుగొందాల్సిన  ఒక సితార భూమి మీద మానవుల మధ్య నడయాడుతుంటే సురదేవ గణాలకు కన్నుకుట్టక ఆనందిస్తారా?  జన్మించేవారంతా మరణించక తప్పదంటారు.  కానీ దానికి కూడా ఒక లెక్కుంది.  శ్రీదేవి మరణ వార్త విని మాకూ ఒక మనసుంది అని వాపోయారు కోట్లమంది అభిమానులు.

‘మహా నటి’ అధ్బుతం

1950 – 80 మధ్య కాలంలో సినీవినీలాకాశంలో ఒక తారగా మెరిసిన సితార.  సినీ స్వర్ణయుగంలో సువర్ణాక్షరాలతో తన జీవితాన్ని విడమరచిన పుస్తకంలా వ్రాసిన అప్సరస.  తెలుగువారి గుండెల్లో నిత్యనూతనంగా మెదలాడే అద్భుతమైన చిత్రాలు దేవదాసు, మాయాబజార్ వంటి సినిమాల్లో వైవిధ్యమున్న పాత్రలు ధరించి తన నటనా కౌశలాన్ని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయే విధంగా నటించిన నటవైదేహి.  ఎన్నో కళాత్మకమైన చిత్రాల్లో సునిశితమైన పాత్రలు ధరించి ఆ పాత్రల్లో మరే ఇతర నటులను ఊహించలేని విధంగా తెలుగువారి గుండెల్లో ముద్ర వేసుకున్న సుమంగళి.  తన నటనతో అందనంత ఎత్తు ఎదిగి చివరి రోజుల్లో శత్రువు కూడా పడరాని కష్టాలను అనుభవించి ఒక దుర్భర జీవితాన్ని గడిపిందంటే నమ్మలేని నిజం.  జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలను చవిచూసినా చివరికి మనందరి గుండెల్లో ‘మహానటి” గానే మిగిలిపోయింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలుగుమల్లి పాఠకులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటన కర్తలకు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం నూతనోత్సాహాన్ని నింపి మీరు చేపట్టిన కార్యాలు శుభప్రదంగా జరగాలని మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సుఖశాంతులతో గడుపుతూ నిత్యనూతనంగా పరిధవిల్లాలని తెలుగుమల్లి అకాంక్షిస్తోంది.

Send a Comment

Your email address will not be published.