ప్రముఖ హీరో ఉదయకిరణ్ (33) ఆదివారం అర్థ రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ ప్రాంతంలో సొంత ఫ్లాట్ లో ఉంటున్న ఉదయ కిరణ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ వంటి సూపర్ డూపర్ చిత్రాలలో నటించిన ఉదయ గత 2012 అక్టోబర్ లో నిషిత అనే యువతిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. భార్య నిషిత రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ విందుకు వెళ్ళిన సమయంలో అతను ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. అతను సూసైడ్ నోట్ లాంటిదేమీ పెట్టలేదు. చివరిసారిగా 11 గంటల ప్రాంతంలో భార్యకు ఫోన్ చేశాడు. ఆ తరువాత కొందరు స్నేహితులకు ఫోన్ చేసి తాను ఇక బతకదలచుకోలేదని చెప్పినట్టు సమాచారం. తన కెరియర్ దెబ్బతిన్నదని అతను అనేక పర్యాయాలు భార్యతో కూడా అన్నట్టు తెలిసింది. అతను బాగా ఆర్ధిక సమస్యల్లో ఉన్నాడని ఆయన భార్య, భార్య తరఫు బంధువులు చెబుతున్నారు. అయితే అతనికి హైదరాబాద్ లో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని తండ్రి మూర్తి అనుమానిస్తున్నారు. అతని ఆత్మహత్యపై తండ్రి అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అతను ఇటీవలే ఒక తమిళ చిత్రంతో సహా నాలుగు చిత్రాలకు సంతకాలు పెట్టినట్టు తెలిసింది. అతను గతంలో కొన్ని తమిళ చిత్రాలలో కూడా నటించాడు.