బ్రోకర్ అనే పదాన్ని చిన్నప్పుడు తప్పుగా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ పదం లేకుంటే పని జరగడం లేదు అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు.
డైరెక్టర్స్ సినిమా పతాకంపై వెంకట్ వద్దినేని సమర్పణలో మద్దినేని రమేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న బ్రోకర్ – 2 చిత్రం పాటల పండగ హైదరాబాద్ లో ఏప్రిల్ నాలుగున ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో దాసరి ముఖ్య అతిథిగా పాల్గొని సి డీ విడుదల చేసి మాట్లాడారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి ప్రధాన పోషిస్తున్నారు. చైతన్యప్రసాద్ సాహిత్యాన్ని సమకూర్చగా విజయ్ బాలాజీ స్వరాలు అందించారు.
సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు బ్రోకర్ అవసరం ఎంతో ఉందని చెప్తూ చివరికి రాష్ట్ర విభజన కూడా ఒక బ్రోకర్ వల్ల జరిగిందని చెప్పారు. అవకాశం వచ్చినప్పుడు ఆ బ్రోకర్ ఎవరో వెల్లడిస్తానని చెప్పారు.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అంటూ ఆరు వందల చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని కానీ వాటిని ప్రదర్శించేందుకు థియేటర్ లు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. సినీ పరిశ్రమ కొందరి చేతుల్లో ఉందని, చేతకాని ప్రభుత్వాల వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆగ్రహం చెందారు. చిన్న సినిమాలు విడుదల చెయ్యాలంటే థియేటర్ లు దొరకవని, దీనిపై పోరాడే సమయం, అవకాశం కోసం చూస్తున్నానని దాసరి అన్నారు. రానున్న కొత్త ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో చూస్తానని లేదంటే తానేమిటో చూపిస్తానని ఆయన తెలిపారు. ఫిలిం చాంబర్ వ్యక్తుల తీరును కూడా ఆయన విమర్శించారు. బ్రోకర్ – 2 చిత్రం సమాజాన్ని చైతన్య పరిచే సినిమా అని ఆయన అన్నారు. బ్రోకర్ కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించిందని, బ్రోకర్ – 2 కూడా ఆ తరహాలోనే విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పోసాని, చైతన్యప్రసాద్, సి పీ ఐ నాయకులు కె నారాయణ, చాడ వెంకటరెడ్డి, సినీ ప్రముఖులు బీ గోపాల్, భేమనేని శ్రీనివాస రావు, దశరధ్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.