ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. గోదావరి యాసలో మాట్లాడి తనకంటూ నటనలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు.
ఆయన హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి నాలుగో తేదీ మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
120కి పైగా సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్ వర ప్రసాద్. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కోడూరు. ఈ ప్రశ్నకు బదులేది చిత్రంలో మొదటిసారిగా నటించిన ప్రసాద్ 1988 లో ఆహుతి చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో తనకు మంచి గుర్తింపు రావడంతో తన పేరును ఆహుతి ప్రసాద్ గా మార్చుకున్నారు. అదే ఇంటిపేరులా మారిపోయింది. ఆయన నటించిన కొన్ని చిత్రాలు – కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గుండె జారి గల్లన్తయ్యిందే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, చందమామ. సూర్యవంశం హిందీ చిత్రంలోనూ నటించిన ఆహుతి ప్రసాదు రెండు తమిళ చిత్రాల్లోనూ నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం రుద్రమదేవి.
ఆహుతి ప్రసాద్ ఇక లేరన్న వార్త టాలీవుడ్ పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు ప్రముఖుకులు చెప్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రకటించారు.
2002 లో ఉత్తమ విలన్ గాను, 2007 లో ఉత్తమ సహాయ నటుడిగాను నంది అవార్డు అందుకున్న ఆహుతి ప్రసాదు ‘మల్లీశ్వరి’ సినిమాలో బడా సోమరిపోతు పాత్రలో నటించి ప్రేక్షకుల్నినవ్వించారు.