మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అబిజ్ఞ వర్గాల భోగట్టా ప్రకారం ప్రస్తుతం చిరంజీవి ఇంగ్లాండ్ లో ఉన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ బ్యాంకాక్ లో ఉన్నారు. పూరీకి బ్యాంకాక్ ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఆయన ప్రస్తుతం అక్కడ చిరు 150 వ చిత్రానికి కథ రాయడంలో తలమునకలయ్యారు. ఆ కథ పూర్తి చేసే వరకు ఆయన అక్కడే ఉంటారు. చిరంజీవి వచ్చే ఆగస్టు 22వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్న రోజున 150వ చిత్రం పూజా కార్యక్రమాలు, తొలి షాట్ కి ముహూర్తం పెట్టుకున్నట్టు సన్నిహిత వర్గాల మాట.
మరోవైపు చిరంజీవి, ఆయన భార్య ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నారు. చిరు దంపతుల చిన్న కూతురు శ్రీజ ఇంగ్లాండ్ లో ఒక విశ్వ విద్యాలయంలో ఎం బీ ఏ పూర్తి చేసింది. శ్రీజ కాన్వకేషన్ కోసం చిరు దంపతులు ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడే శ్రీజతో చిరు దంపతులు కొంత కాలం ఉంటారు.
ప్రస్తుతం తన బరువు తగ్గించుకుని తాజా లుక్ తో చిరు స్వదేశం తిరిగొస్తారని తెలిసింది.