రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా లేక కిరణ్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా లేక వీలైనంత త్వరలో రెండు రాష్ట్రాలనూ ఏర్పాటు చేసేసి ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించి శాసనసభ ఎన్నికలను వాయిదా వేయడమా అన్నది అటు కాంగ్రెస్ నాయకుల్లో, ఇటు కేంద్ర ప్రభుత్వంలో చర్చగా మారింది. శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడంతో కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వాల దృష్టి ఈ అంశం మీద కేంద్రీకృతమయింది. న్యాయ నిపుణులు మాత్రం రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపిస్తున్నారు. వీలయినంత త్వరగా విభజన కార్యక్రమాన్ని పూర్తి చేసి, మూడు లేక నాలుగు నెలల్లో శాసనసభల ఎన్నికలను కోరడం సమంజసంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తే రెండు నెలల్లోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నందు వల్ల అది సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెడితే సీమాంధ్రలో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. కనీసం ఆరు నెలలయినా ఆగాలని సీమాంధ్రకు చెందిన నాయకులు సలహా ఇస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తన భవిష్యత్ కార్యక్రమం మీద తీవ్రంగా మలగుల్లాలు పడుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు. సీమాంధ్ర రాజధానిని, కిరణ్ వారసుడిని అన్వేషించడం ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న ప్రధాన బాధ్యతలు.
కాంగెస్ పార్టీలో తర్జన భర్జన
