కిరణ్ కొత్త పార్టీ?

ప్రస్తుతం వేడి వేడి రాజకీయాలకు కేంద్రంగా మారిన ఆంద్ర ప్రదేశ్ మున్ముందు మరిన్ని సంచలన వార్తలను అందించబోతోంది. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచీ రాష్ట్రం అట్టుడికిపోతోంది. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించడానికి కూడా తెర చాటు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. తాను అడ్డుపడినా, అభ్యంతరాలు చెప్పినా కేంద్ర ప్రభుత్వం తన మాట వినబోదని అర్థం చేసుకున్న కిరణ్ సొంతగా పార్టీ పెట్టి కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన బిల్లు అభిప్రాయం కోసం శాసనసభకు రాగానే దాన్ని సభలో ఓడిపోయేలా చేసి, పదవి నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. శాసనసభలో సీమాంధ్ర సభ్యులు తెలంగాణా సభ్యుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల బిల్లు ఎటూ ఓడిపోతుంది. ఆ తరువాత తాను పదవికి రాజీనామా చేసి, సీమాంధ్ర వెళ్లి, అక్కడి సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఆయన భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కొత్త పార్టీ పెట్టి, ఉద్యమానికి నాయకత్వం వహించడం మీద ఆయన తన సన్నిహితులు, సహచరులతో, ఉద్యోగ సంఘాలతో చర్చలు, సంప్రతింపులు జరుపుతున్నారు.

అయితే గియితే ఈ సీమాంధ్ర పార్టీని డిసెంబర్ లోగా ప్రారంభించాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనలను పార్టీ అగ్ర నాయకత్వం గ్రహించకపోలేదు. అందుకని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును కాస్తంత ఆలస్యం చేయాలని కేంద్రం కూడా భావిస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటపడి, కొత్త పార్టీ పెట్టి అధిష్టానాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. కిరణ్ కూడా నిష్క్రమిస్తే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర ప్రాంతంలో పుట్టగతులుండవు. వాస్తవానికి సీమాంధ్ర ప్రజలు ఎవరు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తే వాళ్ళకే వోటు వేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానానికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా పరిస్థితి తయారయింది.

Send a Comment

Your email address will not be published.