ప్రముఖ సీనియర్ సినీనటుడు జె.వి.రమణమూర్తి తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధిత సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతూ వస్తున్న “గిరీశం” రమణమూర్తి 2016 జూన్ 21 వ తేదీన హైదరాబాదులో కన్నుముశారు.
విశ్వవిఖ్యాత నటుడు “శంకరాభరణం” జె.వి.సోమయాజులు సోదరుడైన రమణమూర్తి వయస్సు 84 ఏళ్ళు. ఆయనకు భార్య, కుమార్తెలు శారదా, నటన, కుమారుడు అరుణ్ కుమార్, హర్షవర్ధన్ ఉన్నారు.
150కి పైగా సినిమాల్లో నటించిన రమణమూర్తికి బాగా పేరు తెచ్చి పెట్టిన పాత్ర కన్యాశుల్కం నాటకంలో పోషించిన గిరీశం పాత్ర. ఆయన నటనను ఎన్ఠీఆర్ స్వయంగా అభినందించడం అమోఘం.
తొలి రోజుల్లో హీరో పాత్రలు చేసినా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన రమణమూర్తి రంగస్థల కళాకారుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన నటించిన కన్యాశుల్కం నాటకం వెయ్యికిపైగా ప్రదర్శనలకు నోచుకోవడం విశేషం.
దాదాపు అయిదు తరాల హీరోలతో కలిసి నటించిన రామమూర్తి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ప్రధాన పాత్రలే పోషించారు.
సప్తపది, గోరింటాకు, గుప్పెడు మనసు, ఆనందభైరవి, మరో చరిత్ర, ఆకలిరాజ్యం వంటి మేటి చిత్రాలలో పేరుప్రఖ్యాతులు గడించిన రమణమూర్తి 1933 మే 20 వ తేదీన విజయనగరం జిల్లాలో జన్మించారు.
ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి.
స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే నాటకాల్లో నటించిన రమణమూర్తి ఎవరు దొంగలు, కప్పలు, కీర్తిశేషులు, కాళరాత్రి, ఫాణి, కాటమరాజు కథ తదితర నాటకాలలో నటించారు.
ఆయన సినిమాల్లో తొలిసారిగా నటించిన చిత్రం ఎం.ఎల్.ఏ. ఈ చిత్రం 1957 లో విడుదల అయ్యింది. నాటకరంగానికి విశేషమైన సేవలందించినందుకు గాను 2015 లో నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం కింద లక్ష రూపాయల నగదు అందుకున్న రమణమూర్తి చివరగా నటించిన చిత్రం ఆర్య. ఈ చిత్రం 2004 లో విడుదల అయ్యింది.
ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి నాటక, సినీ రంగాలకు తీరని లోటని తెలిపారు.