గెలవడమంటే ఓడించడం కాదు

“గెలవాలనుకున్నవాడు ఎప్పుడూ ముందుంటాడు. వాడెప్పుడూ గెలుస్తూనే వుంటాడు
ఓడించాలనుకున్నవాడు వెంటపడతాడు వాడెప్పుడూ వెనకే వుంటాడు

నీవెప్పుడూ నీ గెలుపుకనే పరిగెత్తు ఒకడి ఓటమి కోసం కాదు

గెలవడమంటే ఓడించడం కాదు”.

జీవితంలో గెలుపు ఓటములు సమపాళ్ళు.
ఉన్నతమయిన ఆశయాలు కలిగి మన పల్లె సంప్రదాయాలకు పట్టంగట్టి “ఓనమాలు” వరవళ్ళు దిద్దించి ప్రేమంటే ఒక దివ్యమైన అనుభూతని భౌతికాకర్షణ కాదని “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” లా ఒక తపస్సని – విభిన్నమైన వైవిధ్యమున్న కధాంశాలతో రెండు ఉత్తమ చిత్రాలను తీసి తెలుగు చిత్ర రంగంలో స్వర్ణ యుగాన్ని గుర్తు చేసిన ఉత్త్తమాభిరుచిగల కధా రచయిత మరియు దర్శక నిర్మాత శ్రీ క్రాంతి మాధవ్ కొమరవెల్లి.

వయస్సు చిన్నదైతేనేం మనసు దొడ్డది. భావం ఉన్నతమైనది. ఆశయం గొప్పది. ఆచరణ… అవగాహన పెద్దది.

ఆచార వ్యవహారాలపై మమకారం. పల్లె సంప్రదాయాలంటే గౌరవం. మమత మానవతలంటే వాత్సల్యం. బంధాలు బాంధవ్యాలు అంటే అభిమానం. మన భాషంటే వల్లమాలిన ప్రేమ.

శ్రీ క్రాంతి మాధవ్ మెల్బోర్న్ నగరంలో తెలుగుమల్లితో కలిసి సినీ రంగంలో తన అనుభవాలను పంచుకున్నారు. క్రాంతి మాధవ్ ఖమ్మంలో పుట్టి వరంగల్ నగరంలో పెరిగి విద్యాభ్యాసం చేసారు. చిరుప్రాయంలో సింహభాగం వారి తాత గారి దగ్గర పెరగడం, పల్లెటూరి వాతావరణానికి దగ్గరగా వుండడం వలన వారి మనసులో పల్లె సాంప్రదాయాలు నాటుకుపోయాయి. ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, అనుబంధాలు, మొదలైనవి కూడుకున్న ఒక చిత్రాన్ని నిర్మించాలన్న తలంపు ఎప్పటినుండో ఉన్నట్లు శ్రీ క్రాంతి మాధవ్ చెప్పారు.

ఈ సినిమా రంగానికి రావడానికి స్పూర్తినిచ్చిన శ్రీ AF మాత్యుస్ గారిని గుర్తు చేసుకుంటూ వారు సినిమాల్లో నిశితంగా చేపట్టవలసిన అంశాలను, మెలుకవులను నేర్పించి ఎంతో సహాయం చేసినట్లు శ్రీ క్రాంతి మాధవ్ చెప్పారు. మణిపాల్ కాలేజీలో ఒక పాత్రికేయ వృత్తిని చేపట్టాలన్న ఉద్దేశ్యంతో చేరి శ్రీ మాత్యుస్ గారి ప్రోత్సాహంతో సినిమా రంగానికి దృష్టి మళ్లిందని అన్నారు. 2002 లో పట్టభద్రులైన తదుపరి శ్రీ రామోజీ ఫిల్మ్ స్టుడియోలో ఈ టీవిలో మొదటి ఉద్యోగంలో చేరడం జరిగింది. ఆ తదుపరి మరికొన్ని ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా పని చేసారు.

అయితే ఎప్పుడైనా తనకు తానుగా ఒక మంచి చిత్రం తీసి తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలన్న కోరిక మదిలో మెదుల్తూనే వుంది. ఈ ప్రక్రియలోనే తనవద్దనున్న కధలను చిత్ర రంగంలోని కొంతమంది ప్రముఖులకు వినిపించడం జరిగింది. అయితే పెద్ద స్పందన లేని కారణంగా తానే “ఓనమాలు” చిత్రాన్ని నిర్మించాలని పూనుకున్నారు. అలా ఒక నిశ్శబ్ద తరంగం ఉప్పొంగి 2012 లో తెలుగు వినీలాకాశంలో నింగిని తాకింది. ఈ సినిమాకి ANR అభినందన అవార్డు, భరతముని అవార్డుతో పాటు ప్రధమ చిత్ర ఔత్సాహిక దర్శకుడిగా శ్రీ క్రాంతి మాధవ్ అవార్డునందుకున్నారు. చెన్నై తెలుగు అకాడమీ వారు ఉత్తమ చిత్రంగా అవార్డునిచ్చారు. సంతోషం అవార్డ్స్ వారు ఉత్తమ చిత్రంగా అవార్డునిచ్చారు. బాక్స్ ఆఫీస్ లో చరిత్ర సృష్టించకపోయినా సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయింది. శ్రీ క్రాంతి మాధవ్ గారి అమ్మాయి థియేటర్ లో మొట్టమొదటిగా తన తండ్రి నిర్మించిన సినిమాని చూసి పులకించి పోయింది. తండ్రిగా ఆ అనుభూతిని తన గుండెలో గూడుకట్టుకుంది. మనస్సులో నిలువుటద్దంలా నిలిచిపోయింది.

ఆ తరువాత “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరి లో విడుదలై ప్రేమ చిత్రాలలో సరి క్రొత్త పుంతలు తొక్కింది. కమర్షియల్ గా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిందని శ్రీ మాధవ్ గారు చెప్పారు.

సాంగ్ – డాన్స్ – ఏక్షన్ సూత్రం కాకుండా ప్రముఖ దర్శకులు బాలచందర్, గురుదత్ మరియు టి.కృష్ణ లను ఆదర్శంగా తీసుకొని మంచి చిత్రాలను నిర్మించాలన్న ఆశయంతో శ్రీ క్రాంతి మాధవ్ గారు ప్రస్తుతం రెండు మూడు చిత్రాల కోసం సన్నాహాలు చేస్తున్నారు.

శ్రీ క్రాంతి మాధవ్ గారి శ్రీమతి గాయత్రీ దేవి గారు ఎకనామిక్స్ లో డాక్టరేట్ చేసి మెల్బోర్న్ నగరంలోని విక్టోరియా, మెల్బోర్న్ విశ్వవిద్యాలయాలలో అసోసిఎట్ రీసెర్చ్ స్కాలర్ గా పని చేసారు. సినిమాలు షూటింగ్ చేస్తున్నప్పుడు భారతదేశం వెళ్ళడం జరుగుతుందని, వారి శ్రీమతి సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ చేదోడుగా వుండటం వలన ఇంతటి విజయానికి కారణమయ్యిందని వారి శ్రీమతికి ప్రశంసలు కురిపించారు. వీరి అమ్మాయి భారతదేశంలోనే వారి నాన్నమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ తండ్రి నడకనే కొనసాగిస్తుందని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.