చాలా ఏళ్లుగా ఆత్మహత్యలు, అప్పులతో నానా అవస్థలూ పడుతున్న చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అండగా నిలవబోతోంది. రాష్ట్రంలో జరిగే ప్రతి పండుగ రోజునా పేదలకు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు విధిగా చేనేత వస్త్రాలు ధరించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చేనేత వస్త్రాలపట్ల ప్రజల్లో చైతన్యం పెంచడానికి నటి సమంతను చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. అంతేకాదు, చేనేత కార్మికులు ఆధునిక పోకడలకు తగ్గట్టుగా చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేయడానికి వారికి ఫాషన్ డిసైనర్స్ తో శిక్షణ కూడా ఇప్పిస్తోంది. ఇక నుంచీ బతుకమ్మ, బోనాలు పర్వదినాలప్పుడు కోటి మందికి పైగా మహిళలకు రేషన్ దుకాణాల ద్వారా చీరెలు, పంచలు, జాకెట్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కోటి మందికి పైగా చేనేత కార్మికులున్నట్టు అంచనా. ఉపాధి పథకాల కింద ఇప్పుడు వీరందరికీ రోజంతా పని ఉండే అవకాశం లభించింది. ప్రస్తుతం చేనేత కుటుంబాలు రోజుకు రెండు వేల రూపాయలకు పైగా ఆదాయం సంపాదించుకోగలుగుతున్నారు. అప్పులు, ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, వాళ్లకు రుణాలివ్వడానికి బ్యాంక్స్ మళ్ళీ ముందుకు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.