తాయి ఉచిత కెరీర్ వర్క్ షాప్

ఊహల ఉయ్యాలలో విహరించే ఊసు
ఆశల కెరటాలలో తేలియాడే తలపు
మమతల దీపాలలో చలికాచుకునే మనసు
విషాదాల వేసవిలో జ్వలించే తనువు
–జీవితం గురించి ఒక కవి

ప్రవాసం ఒక సాహసం. వలస రావడం ఒక సమరం. కోటి ఆశల పల్లకికి ఎదురు చూడడం. కావలసినవాళ్ళను వదులుకోవడం. క్రొత్త బాంధవ్యాలకు బాట వేయడం. పరదేశ నివాసం అభిమన్యుని పద్మవ్యూహం. ప్రవేశమే పరమానందం. తిరుగు ప్రయాణం తీరని దాహం.

ఆస్ట్రేలియా దేశానికి యునైటెడ్ కింగ్డమ్, న్యూ జిలాండ్ మరియు చైనా తరువాత భారతదేశం నుండి వచ్చే వలసదారుల సంఖ్య ఎక్కువ. ఆస్ట్రేలియా జనాభా గణాంకాల ఆధారంగా భారతీయుల సంఖ్య ప్రస్తుతం 1.7 (2014) శాతం వుంది. వచ్చే సంవత్సరం 2 శాతానికి దాటుతుందని అంచనా. ఈ గణాంకాలలో తెలుగు మాట్లాడేవారు షుమారు ఒక లక్ష మంది ఉండవచ్చని మరో అంచనా. అంటే భారతీయ వలస దారుల మొత్తం సంఖ్యలో తెలుగువారు 20 శాతం అన్నమాట. అయితే ఇది అధికారికంగా నిర్ధారించబడలేదు. దీనికి కారణం ఆస్ట్రేలియాలో గణాంకాల లెక్కలు జరిగేటప్పుడు చాలామంది తెలుగువారు తమ మాతృ భాష “తెలుగు” అని కానీ తెలుగు భాష కూడా మాట్లాడగలమని కానీ అందులో సూచించడం లేదు. వచ్చే సంవత్సరం జరిగే సర్వేలో తెలుగువారందరూ ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోగలరు.

మెల్బోర్న్ నగరంలో తెలుగు మాట్లాడే వాళ్ళు విద్యార్ధులు, మన రెండు రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలనుండి కూడా వచ్చినవారు షుమారు 30, 000 వరకూ ఉండవచ్చు. అందులో క్రొత్తగా వచ్చినవారు, విద్యార్ధులు లెక్కకు కనపడరు కానీ చాలామంది ఉన్నట్లు తెలుస్తుంది.

ఇరవై ఏళ్ల క్రితం భారతదేశం నుండి ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు వెళ్ళడమంటే ఎవరో తెలిసిన వాళ్ళ గురించి ముందు వాకబు చేసి, వాళ్ళ వివరాలు తెలుసుకొని సంప్రదింపులు జరిపి ఇక్కడి పరిస్థితులు వీలైనంతవరకు అర్ధం చేసుకుని అప్పుడు రావడం జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కంప్యూటర్ ముందు కూర్చుంటే దేశమే కాదు వాడ, వీధి వివరాలు కూడా నిమిషాల్లో తెలుస్తుంది. క్రొత్తగా వచ్చినవారికి ఆస్ట్రేలియా గురించి ఇక్కడున్న వారికంటే ఎక్కువ తెలుసంటే ఆశ్చర్యపడనవసరం లేదు. చాలామందికి పరాయి దేశం వెళ్తున్నప్పుడు “దూరపు కొండలు నునుపు” అన్న చందాన ఇక్కడి పచ్చిక బయళ్ళు, గెంతులేసే కంగారూలు, విశాలమైన రహదారులు, వింత జంతువులు – వీటి గురించే వినాలనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన తరువాత తనను తానై నిలద్రోక్కుకోవడానికి ఎన్ని అవస్థలు పడాలో తెలియదు. ఒకరకంగా అది మంచిదే. ముందే తెలిస్తే వచ్చే సాహసమే చేయరుగదా!

ఇలా క్రొత్తగా వచ్చిన వారికి, విద్యార్ధి దశ పూర్తయి పెర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు పెట్టేవారికి వివిధ అంశాలపై అవగాహనా సదస్సును తాయి (తెలుగు అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియా) అధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించారు. ఈ సదస్సుకు క్రొత్తగా ఆస్ట్రేలియా వలస వచ్చి ఉద్యోగం వెతుకుతున్నవాళ్ళు, విద్యార్ధి దశను ముగించుకొని ఉద్యోగ వేటలో వుండి దీర్ఘకాల నివాసం (పెర్మనెంట్ రెసిడెన్సీ) కోసం దరఖాస్తు పెట్టుకునే దశలో వున్నవారు షుమారు 50 మంది వచ్చారు.

ఈ సదస్సుకు ముగ్గురు నిష్ణాతులైన అతిధులు వచ్చి వారి అనుభవాలను పంచుకోవడమే కాకుండా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. వీరు గౌతమ్ బసక్, టెర్రీ ఒరేల్లీ మరియు మన తెలుగు వారు శ్రీ వెంకట్ తనారి గారు. వీరు ముగ్గురూ ఈ క్రింద నుదహరించిన విషయాలపై కూలంకుషంగా మాట్లాడి చాలామందికున్న సందేహాలు తీర్చారు:
• నెట్ వర్కింగ్
• సాఫ్ట్ స్కిల్స్
• CV తయారుచేయడం లోని మెలుకువలు – ఇందులో ముఖ్యంగా ఏ విషయాలు వ్రాయకూడదు, ముఖ్యమైన విషయాలు ఎక్కడ ఉండాలి, ఎవరికి పంపుతున్నాం
• ఉద్యోగాలు అంతర్జాలం (Internet) లో ఎలా వెదకాలి, ఏ ఏ సంస్థలు తమ వెబ్సైటు లో ఉద్యోగాల కోసం ప్రకటనలిస్తూ ఉంటాయి, కొన్ని సంస్థల్లో మనం ఎలా చేరగలగాలి
• ఇంటర్వ్యూలో ఆత్మ విశ్వాసం, ప్రస్నోత్తరాలు
• పెర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రణాళిక
• IELTS ప్రాముఖ్యత, ప్రత్యామ్నాయ మార్గాలు

ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తాయి అధ్యక్షులు శ్రీ గోపాల్ తంగిరాల గారు తాయి బోర్డు అధ్యక్షులు శ్రీ వెంకట్ దొడ్డి గారు గత 6 నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈనాటికి కార్యరూపం దాల్చడంలో కృతకృత్యులయ్యారని తెలిపారు. ప్రస్తుత తాయి కార్యవర్గ సభ్యులందరూ సహకరించి తగిన సన్నహాలు చేయడం వలన ఈ కార్యక్రమం సాధ్యపడిందని తెలిపారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

తెలంగాణా ఫోరం కార్యవర్గం, ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం ఈ కార్యక్రమ వివరాలు వారివారి నెట్ వర్క్ ద్వారా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుమల్లి కూడా సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.