ఇంటింటికీ నీటి సరఫరా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రారంభోత్సవం చేశారు. గజ్వేల్ పట్టణం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వస్థలం. ఆదివారం నాడు ఒక రోజు పర్యటనకు తెలంగాణకు వఛ్చిన మోడీ ఇక్కడ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. మరో నాలుగు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. మోడీ ఈ సందర్బంగా మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడాలని సూచించారు.
“ఢిల్లీ మీకు దూరం కాదు. అభివృద్ధిలో అన్నివిధాలా తోడుంటా. మీకు సహాయ సహకారాలు అందించడానికి నేనున్నా అని మరచిపోవద్దు” అని మోడీ ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు.
“దాదాపు 40 ఏళ్ళ తరువాత కేంద్రంలో అవినీతి లేని ప్రభుత్వం ఏర్పడింది” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.