తెలంగాణాపై రాష్ట్ర శాసనసభలో బిల్లు పెట్టె పక్షంలో దాన్ని ఓడించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడుపడడం లేదు. ఈ బిల్లును ఏదో విధంగా శాసనసభ ముందుకు తీసుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణా ప్రతిపాదన మీద కేవలం శాసనసభ అభిప్రాయం మాత్రమే తీసుకోవాలని, దాన్ని ఆమోదానికి పెట్టనవసరం లేదని కొందరు నిపుణులు సూచించడంతో అధిష్టానం ఆలోచనలో పడింది. ఇప్పుడు అధిష్టానం తాజా ఆలోచన ఏమిటంటే, బిల్లు స్థానంలో ముసాయిదాను మాత్రమే శాసనసభలో ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా ముసాయిదాను ప్రవేశపెట్టడం వల్ల వివిధ పార్టీలు దీనిపై అభిప్రాయం చెప్పడానికి వీలుంటుంది. ఆ తరువాత దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చు అని పార్టీ భావిస్తోంది. ఈలోగా తెలంగాణా ఏర్పాటుపై నియమించిన మంత్రుల బృందం ఉభయ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి సూచనలు అందజేస్తుంది.