దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణా రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు, 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 11 మందిలో ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామా రావు, మేనల్లుడు హరీష్ రావు కూడా ఉన్నారు. ఒక ముస్లిం నేతకు, ముగ్గురు బీసీలకు, ఒక దళితుడికి ఆయన తన మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు.
అంతకుముందు తెలంగాణా రాష్ట్రం ఏర్పడినట్టుగా కేంద్రం నుంచి అధికార ప్రకటన వెలువడింది. దాంతో తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తొలగిపోయింది. ఇక ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం అన్నట్టుగా గవర్నర్ నరసింహన్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. ఒకే రోజున గవర్నర్, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి.