తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విజయ సాధిస్తే ముఖ్యమంత్రి పదవి వెనుకబడిన తరగతులకే అని ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. వెనుకబడిన తరగతుల నాయకుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆర్. కృష్ణయ్య పేరును తెలంగాణా ప్రాంత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. బీసీ పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉన్న పేరు దీనితో మరింత బలపడుతుందని, ఒక్క తెలంగాణలోనే కాక సీమాంధ్రలో కూడా అధిక సంఖ్యలో ఉన్న బీసీలను ఈసారి కూడా ఆకట్టుకున్నట్టు అవుతుందని ఆయన ఆశిస్తున్నారు.
తమ పార్టీ విజయం సాధిస్తే తెలంగాణాలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించినప్పుడు, “బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీకే మా మద్దతు” అని కృష్ణయ్య వెల్లడించారు. అతి త్వరలో కృష్ణయ్యను లాంచనంగా పార్టీలో చేర్చుకోబోతున్నారు. తెలంగాణా ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.