సుందర స్వప్నం. సుమధుర తలపు. నిజం చేయాలన్న పోరాటం. లక్ష్య సాధనయందే మనసు లగ్నం. గమ్యం చేరాలన్న ఆరాటం. గగన తలమే పరిమితం. నిత్య నూతనమే పరమానందం. నిరంతర ప్రయోగాలకు సోపానం. నిర్విరామ కృషికి అందలం. జన సందోహం దోసాకు దాసోహం. భిన్న సంస్కృతిలో స్థిరపడుతున్న తెలుగుదనం. మరో ఇద్దరు మిత్రుల కధనం.
బ్రాండ్ నేమ్…
మెల్బోర్న్ నగరంలో దోసాహట్ ఒక బ్రాండ్ నేమ్ (వాణిజ్య చిహ్నం). ఏడాది క్రితం “దోసా తినాలంటే ఫుట్ స్క్రీ వెళ్ళాలి, మనకి దగ్గరలో వుంటే బాగుండేది గదా. హాయిగా శనివారం ప్రొద్దున్నే లేచి ఎంచక్కా దోసాహట్ కి వెళ్లి వేడి వేడి దోసాలు తింటే అందులోని మజా ఇంకెందులో వుంటుంది!!!” అనుకునేవాళ్లు. దోసాహట్ యాజమాన్యం జనం మాట విన్నట్లున్నారు. మరో రెండు అంగడులు తెరిచారు. ఒకటి టార్నీట్ లో మరొకటి రాక్స్ బర్గ్ లో. అక్కడి చుట్టుప్రక్కల నివసిస్తున్న వాళ్ళు, మన తెలుగువారే కాకుండా, భారతీయులు, ఇతర దేశాలకు చెందిన వారు – ముఖ్యంగా టర్కీ దేశస్తులు, లెబనాన్ దేశస్తులు, స్థానికులు “హమ్మయ్య ఇక ఫుట్ స్క్రీ వరకు వెళ్లనక్కర్లేదని” ఊపిరి పీల్చుకున్నారు.
అయితే మన తెలుగు వారికి, భారతీయులకి దోసా అంటే కొంత అవగాహన వుంది. దాని రుచేమిటో తెలుసు. మిగిలిన వారు ఈ ఆహారానికి ఆకర్షితులవ్వడానికి కారణాలేమిటి? మొదటి కారణం నాణ్యత (quality) అంటున్నారు అభినవ్. రెండోది వైవిధ్యం (variety) అంటున్నారు కిషోర్.
రాక్స్ బర్గ్ ప్రస్థానం…
అభినవ్, కిషోర్ షుమారు పన్నెండేళ్ళ క్రితం అందరిలాగే విద్యార్ధులుగా వచ్చి చదువు పూర్తి అయిన తరువాత వుద్యోగాల్లో చేరి పెళ్లి చేసుకుని సంసార సాగరంలో ప్రధమాంకం ముగించారు. సంసారానికి మరికొంత సంస్కార సారం తోడుచేసి వ్యాపారంతో నలుగురికీ ఉపయోగపడితే బాగుంటుందన్న యోగ్యమైన ఆలోచన రావడమే తడవుగా రాక్స్ బర్గ్ లో దోసాహట్ 5 నెలల క్రితం శ్రీకారం చుట్టారు. మొదలు పెట్టిన దగ్గరనుండి ప్రతీ రోజు క్రొత్తదనం కోసం తాపత్రయ పడటం, స్థానికుల కోసం మన దినుసులు వాడి రుచికరమైన ఆరోగ్యకరమైన వైవిధ్యమున్న వంటకాలు తయారుచేయడానికి తగు శ్రద్ధ తీసుకొని ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు ఇద్దరు మిత్రులు.
ఇద్దరూ ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తుండటంతో అర్ధాంగులు ముందుకొచ్చి విజయ సాఫల్యానికి కృషి చేయడం ఎంతో ముదావహం. “ముదితల్ నేర్వగలేని విద్యగలదే” అన్న చందాన వారు చదువుకున్న విద్యకు భిన్నమైనా, అష్టావధాన ప్రక్రియలో ఆరితేరిన వారు కనుక లోకజ్ఞానాన్ని అనుసరించి వ్యాపార మెలుకవులు నేర్చుకుంటూ అభినవ్, కిషోర్ ఇద్దరికీ చేదోడు వాదోడుగా వుంటున్నారు. ఇద్దరు మిత్రులూ తమ అర్ధాంగులకు మనఃస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
చాక్లెట్ దోసా…
షుమారు వంద రకాల దోసాలతో చిల్లీ ఇడ్లీ, చికెన్ మంచూరియా, చిల్లీ గోట్, ఇండో-చినీస్ ఫ్రై, ఇండో-చినీస్ గ్రేవీ, జంబో చికెన్ బిర్యానీ – ఇలా వివిధ రకాల ఆహార పదార్ధాలతో పాటు కొన్ని ఫుట్ స్క్రీ లో దొరకని వెరైటీస్ కూడా ఇక్కడ చేస్తున్నారు.
దోసాకున్న ప్రత్యేకతేమిటంటే ఫలహారంగానూ (snack) మరియు మధ్యాహ్న/రాత్రి భోజనంగా కూడా తినవచ్చు.
అయితే దోసాని స్వీట్ డిసర్ట్ గా కూడా తినవచ్చన్న్డది క్రొత్త ప్రయోగం. ప్రస్తుతం చాక్లెట్ దోసాగా ప్రసిధ్ధి పొంది డిసర్ట్ గా చాలామంది ఆస్వాదించటం దోసాహట్ కే చెందుతుంది. ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేందంటే నమ్మబుద్ధి కాదు.
లస్సి & పాన్…
వేసవికాలం టీ కంటే మజ్జిగ త్రాగితే బాగుంటుందని ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెబుతుంటారు. దోసహాట్ లో స్వీట్ మాంగో లస్సి, సాల్తేడ్ లస్సి రెండు రకాలూ దొరుకుతున్నాయి. ఇక్కడ తమలపాకులతో కూడిన తాంబూలం కూడా దొరుకుతుంది.
మెగా & కోంబో డీల్స్…
8 మంది గానీ అంతకంటే ఎక్కువమందికి మెగా డీల్స్ చాలా వున్నాయి. వీటిలో ఫ్రైడ్ రైస్, నూడుల్స్, బిర్యానీ అన్ని రకాలు అందుబాటులో వున్నాయి. కోంబో డీల్స్ లో ఒక్క దోసానే కాకుండా వెరైటీగా దోసాతో పాటు ఇడ్లీ, వడ, డ్రింక్ డీల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ డీల్స్ లో ఒక్కోరికి డబ్బు చాలా తక్కువ పడుతుంది. మెనూలో చాలా ఐటమ్స్ వెల $10.00 లోపే ఉన్నాయి – ప్రత్యేకమైనవి తప్ప.
దోస ఇన్ లైవ్…
ప్రస్తుతం పుట్టిన రోజు వేడుకలకు, మరే ఇతర కార్యక్రమాలకు ముందుగా ఆర్డర్ చేస్తే ఆహారాన్ని సరఫరా చేస్తుంటారు. అంతే కాకుండా కొన్ని కార్యక్రమాల్లో తగిన సదుపాయం కల్పిస్తే అక్కడే వేడి వేడి దోసాలు వేసి అందివ్వడం కూడా జరుగుతుంది. వింటుంటేనే నోరూరుతుంది కదూ!
డోర్ డెలివరీ…
ప్రస్తుతం సాయంత్రం 5 గంటల తదుపరి డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. సరైన వనరులు సమకూర్చుకొని మిగతా టైములో కూడా డోర్ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అభినవ్ చెప్పారు.
అనిల్ మరియు ప్రవీణ్ గత దశాబ్దకాలం ఎంతో కృషి చేసి దోసాహట్ ని ఒక వ్యాపార చిహ్నంగా తీర్చిదిద్దారని ముందు ముందు చుట్టుప్రక్కల వున్న ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి దోసాహట్ ఒక సాధారణ గృహోపకరణ వస్తువుగా తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయమని అభినవ్ మరియు కిషోర్ చెప్పారు.