నటులూ మంచి రాజకీయనేతలు కావచ్చు

హిందీ చలచిత్ర పరిశ్రమ అసలైన డ్రీం గర్ల్ హేమమాలిని ఇప్పుడు ఓ కొత్త పాత్రలో తనదైన ముద్ర వేసుకోవడానికి ఆరాటపడుతున్నారు.

పదహారవ లోక్ సభకు మథుర నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేసి 3,40,000 ఓట్లతో ఎన్నికైన హేమమాలిని తనపై మథుర ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా మంచి పనులు చెయ్యడానికి అంకితభావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మథుర నియోజక అభివృద్ధికి అహర్నిశలూ పాటు పదాలన్నది హేమమాలిని ఆకాంక్ష.

నటిగా తాను మంచి విజయాన్నే సాధించానని ఆమె గుర్తు చేశారు. అప్పుడుకూడా తాను డ్యాన్స్ లోను ఏ లోటు రాకుండా వీలున్నప్పుడల్లా నృత్య ప్రదర్శనలు ఇచ్చానని ఆమె తెలిపారు.

భార్యగా, పిల్లలకు అమ్మగా, గృహిణిగా నేను నా పాత్రలను సమతుల్యంతో సాగించానని హేమమాలిని చెప్పారు.

నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. బాగానే స్థిరపడ్డారు. కనుక నేను ఈ కొత్త రాజకీయ పాత్రలో అంటే పార్లమెంట్ సభ్యురాలిగా తనను గెలిపించిన మథుర ప్రజలకు తగు సేవలు చెయ్యగలననే విశ్వాసం ఉందని ఆమె చెప్పారు.

ప్రతీ నెలలో కనీసం వారం రోజులు మథురలో ఉండి అక్కడి ప్రజల కష్టసుఖాలు చూస్తానని, వాళ్లకు అవసరమైన పనులు చేస్తానని అన్నారు.

రాజకీయ నేతలుగా మారిన సినీ తారలు సరిగ్గా విధులు నిర్వర్తరించరని చాలా మంది అపోహ. ఈ అపోహను తొలగించి రాజకీయాలలోకి వచ్చిన తారలు కూడా మంచిగానే పని చేస్తారనే నమ్మకం ప్రజలలో కలిగించడానికి తాను కృషి చేస్తానని చెప్పారు.

ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో తనను చాలామంది తీవ్ర పదజాలంతో విమర్శించారని, ఆ మాటలన్నీ విన్నాక తాను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నానని హేమమాలిని అన్నారు.

తనకు టికెట్ రాకుండా తమ పార్టీకి చెందిన కొందరు అడ్డుపుల్లలు వేసారని, కానీ వారి ఆటలు సాగనివ్వక పోటీ చేసే అవకాసం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెప్తున్నానని ఆమె అన్నారు.

నటులు వినోద్ ఖన్నా, శత్రుఘన్ సిన్హా తమతమ ప్రాంతాలలో ఇప్పటికే తమకు అప్పగించిన విధులను చేసి మంచి పేరే సంపాదించారని, తానుకూడా గట్టిగానే పని చేస్తానని హేమమాలిని హామీ ఇచ్చారు.

సినీ నటులుగా తాము ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించామని, తమకో విజన్ ఉందని, కనుక నటులు కూడా రాజకీయ రంగంలో రాణిస్తారని రుజువు చేస్తానని ఆమె అన్నారు.

తన భర్త ధర్మేంద్రను ప్రజలు అందగాడని చెప్పుకుంటుంటే తనకు గర్వంగా ఉందని హేమమాలిని అన్నారు.
ధర్మేంద్ర నిజంగానే అందగాడని, ఆయనపై తన చూపులు ఎప్పుడూ పక్కకు తప్పుకోవని ఆమె తెలిపారు. అయితే తన భర్తకు పంజాబీ వంటకాలను చేసి పెట్టలేకపోతున్నానని, అందుకు కొంత విచారపడుతున్నానని ఆమె చెప్పారు. తాను దక్షిణాది వంటకాలను సులువుగానే చేస్తానని అన్నారు. అయితే తనకన్నా తమ కుమార్తెలు ఈషా, అహనా బాగా వండుతారని ఆమె నవ్వుతూ ఒప్పుకున్నారు.

ధర్మేంద్ర, హేమమాలిని చూడముచ్చటైన జంట అని ఎప్పుడో ముద్ర వేయించుకున్నామని ఆమె అన్నారు.

ఎప్పుడూ కుటుంబంతోనే గడపడానికి ఇష్టపడే హేమమాలిని ఇప్పుడు ఈ కొత్త రాజకీయ పాత్రలో ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుందనేది ఖాయం. అందుకు తాను సిద్ధమయ్యానని ఆమె అన్నారు.

ఈషా, ధరంజీ ముంబైలో ఉంటారని, అహనా డిల్లీలో ఉంటుందని ఆమె చెప్పారు. ఇక తన విషయానికి వస్తే తాను, డిల్లీ, ముంబై, మథుర మధ తిరుగుతూ ఉండవలసి ఉంటుందని అన్నారు. అయితే తాను ఈ క్రమంలో కుటుంబానికి ఏమేరకు న్యాయం చేస్తానో చెప్పలేనని అన్నారు. అది కొంచం కష్టమే అని చెప్పారు. అయితే అటువటివి మనసులో పెట్టుకోవద్దని, వీలున్నప్పుడల్లా తామే వచ్చి కలుస్తామని భర్త, పిల్లలు చెప్పారని హేమమాలిని అన్నారు.

రాజకీయాలలోకి వచ్చినంత మాత్రాన తాను నటనకు గుడ్ బై చెప్పినట్టు అనుకోవద్దని, మంచి కథలు, మంచి పాత్రలు వస్తే సినిమాలో నటిస్తానని ఆమె అన్నారు. బాగ్ బన్, వీర్ జార వంటి సినిమాల్లో చేసినటువంటి పాత్రలు మళ్ళీ వస్తే తాను నటిస్తానని అన్నారు.

ఫీట్ నెస్ విషయంలో తాను ఇప్పటికీ ఎంతో శ్రద్ధ చూపిస్తానని చెప్పిన హేమమాలిని ఓ ట్రైనర్ పర్యవేక్షణలో తాను శారీరక ఫీట్ నెస్ కోసం అవసరమైన వ్యాయామాలు చేస్తుంటానని అన్నారు. శారీరక బరువు విషయంలో తగు జాగర్తలు తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు.

మన భారతీయ వస్త్రాలే తనకు ఇష్టం కావడం వల్ల షాపింగ్ తానే చేసుకుంటానని, ఇప్పుడు మరీ ఎక్కువ మేకప్ చేసుకోవడం లేదని అన్నారు.

త్వరలో అమెరికాలో కొన్ని ప్రదర్శనలు ఇవ్వవలసి ఉందని, తమ కుమార్తెలతో కలిసి దుర్గా నృత్య రూపకం చెయ్యవలసి ఉందని హేమమాలిని అన్నారు.

Send a Comment

Your email address will not be published.