తెలుగు సినీ నటుల సంఘమయిన మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (మా) ఎన్నికలు క్రమంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నెల 29న మా ఎన్నికలు జరగబోతున్నాయి.
అధ్యక్షుడిగా నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక ఖాయమనుకుంటున్న సమయంలో చివరి నిమిషంలో నటి జయసుధ బరిలోకి దిగారు. ప్రస్తుత అధ్యక్షుడు మురళి మోహన్ ఆమెకు మద్దతు ప్రకటించారు. కాగా రాజేంద్ర ప్రసాదుకు నాగబాబు వర్గం మద్దతు తెలిపింది. దాంతో తెలుగు నటీ నట వర్గం రెండుగా చీలిపోయినట్టయింది ఈ పరిణామాలు సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సినీ పరిశ్రమంతా తనకు మద్దతు తెలుపుతున్నందు వల్లే తాను ఎన్నికల్లో నిలబడదలచుకున్నానని గత రెండవ తేదీన రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. సుమారు 32 సంవత్సరాల నుంచీ సినీ రంగంలో ఉన్న తాను కళామ తల్లికి మరింతగా సేవ చేసుకోవాలను కుంటున్నట్టు ఆయన ప్రకటించారు. తనకు పోటీ లేకుండా, తాను ఏకగ్రీవంగా ఎన్నికయితేనే పోటీ చేస్తానని కూడా ఆయన తెలిపారు. తీరా జయసుధ ఎన్నికల్లో ఆయనకు పోటీగా నిలవడం, ఆమెకు మురళీ మోహన్ మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.