'నా బంగారు తల్లి' బంగారమే

అరవై ఒకటవ జాతీయ చలన చిత్ర పురష్కారాల వివరాలను ఏప్రిల్ 16వ తేదీన న్యూడిల్లీలో ప్రకటించారు. ఈ సారి నా బంగారు తల్లి చిత్రానికి మూడు అవార్డులు దక్కడంతో జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాలకు చెప్పుకోదగ్గ గుర్తింపు లభించడం లేదని బాధపడుతున్న వారికి కాస్తంత ఊరట లభించినట్లే చెప్పుకోవాలి. నా బంగారు తల్లి చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ నేపధ్య సంగీతం, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అంజలి పాటిల్ కు ప్రత్యేక ప్రశంస  అవార్డులు దక్కాయి.
మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులు జరుగుతున్న నేపద్యంలో దర్శకుడు రాజేష్ టచ్ రీవర్ నా బంగారు తల్లి చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా ఈ చిత్ర కథ సాగుతుంది. ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. నేపధ్య సంగీతం విభాగంలో శాంతను మొయిత్రా జాతీయ పురస్కారం పొందగా అంజలి పాటిల్ నటనకు మరో అవార్డు ప్రకటించారు.
నా బంగారు తల్లిలో దుర్గ పాత్ర పోషించిన అంజలి పాటిల్ తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. డిల్లీ ఇన్ ఎ డే, చక్రవ్యుహ్ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన అంజలి మాట్లాడుతూ ” నా ఆనందానికి అవధులు లేవు. నాకు ఈ అవార్డు ప్రకటించినట్టు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా మిత్రులలో ఒకరు నాకు ఫోన్ చేసి ఈ అవార్డు విషయం చెప్పారు. ఈ చిత్రం ఒక వాస్తవ కథ ఆధారంగా చిత్రీకరించారు. కథ చిత్రీకరణ అంత సులభమైనది కాదు. అయినా దర్శకుని ప్రతిభ అమోఘం. నా దుర్గ పాత్ర అనుకున్నంత సులభం కాదు. ఈచిత్రానికి అవార్డులు రావడం అన్ని విధాలా సబబే. స్పాట్ బాయ్ నుంచి దర్శకుడి వరకు ప్రతి ఒక్కరికీ అవార్డులో భాగస్వామ్యం ఉంది. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడుల నుంచి రక్షింపబడిన మహిళలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. డిల్లీ ఇన్ ఎ డే చిత్రంలో నా నటనను  దర్శకుడు రాజేష్ మెచ్చుకున్నారు. నా బంగారు తల్లి సినిమా స్క్రిప్ట్ నాకు పంపించి నన్ను సంప్రదించారు. అందులో దుర్గ పాత్ర నాకు ఎంతో నచ్చింది. నేను ఆ పాత్రను సవాల్ గా తీసుకుని నటించేందుకు ఒప్పుకున్నాను. రాజమండ్రి, గోదావరి తదితర ప్రాంతాల్లో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ మరచిపోలేను. ఈ చిత్రంలోని స్టంట్ సీన్లలో నేను స్వయంగా నటించాను. నాకు అవార్డు దక్కుతుందనే భావనతో నటించలేదు. పాత్ర మీద ఇష్టంతో చేసాను. నా నటనకు అవార్డు దక్కడం వాళ్ళ నా శ్రమ వృధా కాలేదు. ఎంతో ఆనందంగా ఉంది ” అని చెప్పారు.
అలాగే ప్రపంచ సినిమాపై నందగోపాల్ రాసిన సినిమాగా సినిమా అనే పుస్తకానికి కూడా సినిమాపై ఉత్తమ రచన అవార్డు దక్కింది. ” సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఎన్ ఎఫ్ డీ సి సభ్యునిగా పని చేయడం ఈ పుస్తక రచనకు ఎంతో తోడ్పడింది ” అని నందగోపాల్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.