నిర్మాతలకే కష్టాలు

ఈమధ్య నటి శృతి హాసన్ ఓ సినిమా నుంచి ఆఖరి క్షణంలో తప్పుకోవడంతో స్టార్స్ కు ఉన్న గిరాకీతోపాటు నిర్మాతల ఇబ్బందులు చర్చకొచ్చాయి.

సినిమా నిర్మిస్తున్నప్పుడు అనుకోకుండా ఎదురయ్యే పరిణామాల వేళ నిర్మాత వాటిని అధిగమించడానికి కిందామీదా పడతారు. యూనిట్ లోని అన్ని వర్గాలనూ కలుపుకుపోవడానికి సహకరిస్తారు. నటులు అనారోగ్యం పాలైనా లేక వారి కుటుంబంలో ఏదైనా జరగరానిది జరిగినా వారి విషయంలో అవసరమైన రీతిలో తోడ్పడుతారు. కొన్నిసార్లయితే వారి ఓర్పుకు అగ్ని పరీక్షగా అనిపిస్తుంది నటీనటులు పెట్టే కష్టాలు.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ “ఈ మధ్య కాలంలో నటీనటులు ఒకే సారి రెండు మూడు సినిమాలకు సంతకాలు చేసిన క్రమంలో మొదటి సినిమా పూర్తికాక ఒప్పుకున్నా తదుపరి చిత్రానికి వచ్చేసరికి ఆలస్యం చేస్తారు. పూర్వం నటీనటులు ముందుగానే డేట్స్ ఖాయం చేసుకుని ఆ మాటకు కట్టుబడి ఉండటం వల్ల నిర్మాతకు ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకవేళ డేట్స్ ఇచ్చినా ఆ డేట్ కి నటీనటులు వస్తారా అనేది ప్రశ్నార్ధకం. ఇలా చేయడం వల్ల యూనిట్ మొత్తానికి కష్టమే…నష్టం కూడాను. ఈ రోజుల్లో సినీ పరిశ్రమలో క్రమశిక్షణ అనేది లేదు” అని అన్నారు.

ఆయనే ఇంకా ఇలా అన్నారు…

“డబ్బుకన్న మరింత పెద్ద సమస్య మళ్ళీ చిత్రీకరణకు డేట్స్ ఖరారు చేయడమే. కొన్ని నిర్మాత నష్టాన్ని భరించగలుగుతాడు. అయితే డబ్బు కన్నా ప్లానింగు విషయంలో తలెత్తే సమస్యలు అనేకం” అని.

ఇక రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న బాహుబలి విషయానికి వస్తే ఆ చిత్ర నిర్మాత యార్లగడ్డ శోబు మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో కాదు గానీ తానూ చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తలో కొన్ని సందర్భాలలో ఇలాంటి కస్టాలు తప్పలేదన్నారు. అయితే బాహుబలి విషయంలో తారల నుంచ ఎలాంటి సమస్యలు తలెత్త లేదని, ఒక స్టార్ చేస్తున్న ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అనేది అరుదైన విషయమని, నిర్మాత, స్టార్ మధ్య సంబంధాలలో కొన్ని కారణాల వల్ల దూరం చోటుచేసుకుంటే మాత్రం తలనొప్పులు తప్పవని అన్నారు. చివరి క్షణంలో స్టార్ తప్పుకుంటే ఫిలిం చాంబర్ ని ఆశ్రయించక తప్పదన్నారు. వందల జూనియర్ నటీనటులతో అంతా సిద్ధం చేసిన సమయంలో స్టార్ యాక్టర్ రాకపోతే కలిగే నష్టం నిర్మాతకే తెలుస్తుందని ఆయన చెప్పారు.

ఇలాంటి కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఎక్కువగా కొత్త నటీనటులతో తీయడానికే ఇష్టపడతారు. వారితో సమస్యలు తక్కువని చెప్పారు. నిజం చెప్పాలంటే నిర్మాత అనే వాడు సాధారణంగా తారలపై యాక్షన్ తీసుకోరని, ఇంకా చెప్పాలంటే సినిమా పూర్తి చేయడానికే ఇష్టపడతాడని ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.