పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి వేసవిలో తనకిష్టమైన కొందరికి మామిడి పండ్లు కానుకగా పంపుతుంటారు. ఆయన తోటలో పండిన మామిడి పండ్లను చక్కగా ప్యాక్ చేసి పంపడంలో ఉన్న ఆనందం ఇంతా అంతా కాదంటారు పవన్.
ఆయన నుంచి ఓ పదిహేను మందికి ఈ రకంగా కానుకగా మామిడి పళ్ళు అందటం రివాజు. అయితే ఈ పండ్లు అందుకునే వారి జాబితా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ పండ్లను పంపడంలో ఆయనేమీ వారూ వీరని హెచ్చుతగ్గులు చూడరు. సాంకేతిక వర్గంలోని వారికైనా పంపడానికి వెనుకాడరు. ఆ ఏడాదిలో తనకు అత్యంత సన్నిహితులు అనిపించుకున్న వారికి ఆయన పండ్లు పంపడం ఆనవాయితి. ఉదాహరణకు ఆయన నుంచి పండ్లు అందుకునే వారిలో సోదరులు చిరంజీవి, నాగబాబు ఉండటం సాధారణమే. కానీ ఈసారి ఆయన పండ్లు పంపిన వారి జాబితాలో ఈ సోదరులిద్దరి పేర్లు కనిపించలేదు. ఎన్నికల సమయంలో ఆయన వోటేసి గెలిపించామని పిలుపు ఇచ్చిన రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా? అటు కేంద్రంలో బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఆయన నుంచి మామిడి పండ్లు అందుకోవడానికి విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన కానుక కోసం ఆశిస్తారు అనడంలో సందేహం లేదు. అయితే ఆయన తనకంటూ ఒక జాబితా తయారు చేసి ఆమేరకు పండ్లు పంపడం రివాజు. ఆయన నుంచి మామిడి పండ్లు అందుకున్న నటుడు నితిన్ ” పవర్ స్టార్ ఈసారి కూడా నాకు మామిడి పండ్లు పంపారు. అవి ఎంతో తియ్యగా ఉన్నాయి. ఆయనకు ధన్యవాదాలు” అని ట్వీట్ చేసారు.
పవర్ స్టార్ సన్నిహితుడొకరు మాట్లాడుతూ ఆయన కంటికి రెప్పలా తన తోటను చూసుకుంటారని, స్థానిక రైతులను రప్పించుకుని వారితో తోటను నిగనిగలాడిస్తారని, సీజన్ చివర్లో మామిడి పండ్లు తనకు ఇష్టమైన వారికి పంపుతారని, తనతో వర్క్ చేసిన ఓ పదిహేనుమంది పేర్లతో ఒక జాబితా తయారు చేసి వారికి వాటిని పంపుతారని చెప్పారు. తోటను పరిశుభ్రంగా ఉంచాడానికి అవసరమైన చర్యలను ఆయన ఎప్పటికప్పుడు తీసుకుంటారని ఆయన అన్నారు. ఆయన ఈసారి మామిడి పండ్లను తన సోదరులకు పంపలేదని, కానీ డి సురేష్ బాబుకి, మరో కిందరికి పంపారని చెప్పారు. గత ఏడాది బ్రహ్మాజీకి పంపారని, కానీ ఈ సారి ఆయనకు పంపలేదని తెలిపారు. సురేష్ బాబు సినిమా గోపాల గోపాలాలో ఆయన నటిస్తున్న సంగతి విదితమే.
“అవును…నాకు ఈసారి పవన్ కళ్యాణ్ నుంచి మామిడి పండ్లు అందాయి…” అని సురేష్ బాబు తెలిపారు.