ఒకప్పుడు ప్రవాసం ఒక విలాసం. సుదూర ప్రయాణం ఒక ఉల్లాసం. ప్రవాసంలో నివాసం ఒక సుందర స్వప్నం. వలస రావడం ఒక విన్యాసం. కలిసిపోవడం ఒక విలక్షణం. నిలుపుకోవడం ఒక ఖండ కావ్యం.
ఐదు దశాబ్దాలు దాటిన ఆస్ట్రేలియా ఆంధ్రుల ప్రస్థానంలో మెల్బోర్న్ లోని తెలుగువారు సామాజికంగా, ఆర్ధికంగా, సాంఘికంగా, రాజకీయపరంగా, వ్యాపారపరంగా ఎంతో ముందంజ వేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ స్థానిక సంస్థలతో మమేకం అవుతున్నారు. 1970, 80 దశకాలలో వేళ్ళపై లెక్కపెట్టగల తెలుగు కుటుంబాలు ఎవరి ఇంట్లోనో కలిసి పూజలు చేసుకుంటూ, భజన పాటలు పాడుకుంటూ కొన్ని శతాబ్దాల మన వారసత్వ సంస్కృతిని నిలబెట్టుకోవాలన్న తపనతో ఎంతో కృషి చేసారు. తరతరాల మన భాషా-సంస్కృతులను తరువాతి తరం వారికి అందివ్వడంలో కృతకృత్యులయ్యారు. ఈ ప్రక్రియలో భాగంగా తమకంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా, ప్రజా సేవా కార్యక్రమాలు కూడా చేయగలమన్న తలంపుతో 1992 లో తెలుగు సంఘాన్ని (తాయి) స్థాపించడం జరిగింది. ఈ సంఘం ఇంతింతై ఒటుడింతై అన్నట్లు 30-40 కుటుంబాలతో విత్తనంగా మొలకెత్తి ఇప్పుడు షుమారు 500 మంది సభ్యులు గల వట వృక్షంగా ఎదిగిందంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘంగా నడిచే అన్ని సంస్థల దారిలోనే తాయి కూడా కొన్ని ఒడుదుడుకులు ఎదొర్కొని పాతికేళ్ళ పల్లె పడుచులా తన అందాలను ఒలకబోయడానికి ఈ సంవత్సరం సిద్ధమౌతుంది. రజతోత్సవ వేడుకలను కనులపండువుగా జరుపుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది.
పాతికేళ్లలో ఎన్నడూ పోటీ లేకుండా, ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గాలలో చాలామంది ఈ తెలుగు సంఘాన్ని ప్రతీ ఏడు ఒక మెట్టు ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నానికి అపోసన పట్టి అకుంఠిత దీక్షతో పనిచేసినవారే. ఎందరో త్యాగధనులు తమ కుటుంబాలతో సహా కొన్ని సంవత్సరాలు తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఆర్ధికంగా వారికి కలిగింది ధారపోసి ఈ సంఘాన్ని నిలబెట్టారు. ప్రతీ ఏడాది క్రొత్తగా వచ్చినవాళ్లు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఈ సంఘం గురించి తెలియనివాళ్ళు, ఇంకా ఎంతోమంది తెలుగువాళ్ళను అక్కున చేర్చుకొని సభ్యుల సంఖ్య పెంచుకుంటూ వసుదైక కుటుంబంగా పేరొంది విక్టోరియా ముల్టీ కల్చరల్ కమిషన్ నుండి గుర్తింపు సాధించిన సంస్థ తాయి.
ప్రతీ ఏటా ప్రజా బాహుళ్యం పొందిన “జనరంజని”, “రసరాగ సుధ” కార్యక్రమాలతో పాటు యువతకు ప్రాధాన్యం ఇచ్చే “జజ్జనక” కార్యక్రమం కూడా కొన్నాళ్ళు నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఈ కార్యక్రమం మధ్యలో కొనసాగకపోయినా ఈ రజతోత్సవాలు సందర్భంగా యువతకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని గత వారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ రామారావు మునుగంటి గారు తెలిపారు.
పాతికేళ్ళ మనుగడ సాగించి ఎప్పటికప్పుడు తనకు తానుగా సింహావలోకనం చేసుకుంటూ ఒక సామాజిక సంస్థగా ఎదగాలని ఈ క్రింద ప్రతిపాదించిన అంశాలకు ప్రాముఖ్యతను కల్పించి రజతోత్సవాలను జరుపుకోవాలని తలంపుతో క్రొత్త కార్యవర్గం పనిచేస్తుంది:
· అధికార వికేంద్రీకరణ
· ప్రజారంజకమైన పనులను కార్యవర్గ సభ్యులందరూ చేపట్టడం
· చేస్తున్న పనుల్లో వీలున్నంతవరకు పారదర్శకత్వం కనబరచడం
· విలువల ప్రాతిపదికగా కార్యక్రమాలను చేపట్టడం
· ఆర్ధిక సహాయన్నందిస్తున్న వ్యాపార సంస్థలకు తగు ప్రయోజనం కల్పించడం
· తగినన్ని ఉప సంఘాల ద్వారా సాధ్యమైనంత వరకూ సభ్యుల మనోభావాలకు చేరువవడం
· యువతకు ప్రాధాన్యం కల్పించడం
· అభివృద్ధి దిశలో డిజిటల్ సాంకేతికతను ఉపయోగించడం
· ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే ఆర్ధిక సహాయాన్ని వినియోగించుకోవడం
· వీలున్నంతవరకూ జీవిత సభ్యులను నమోదు చేసుకోవడం
· సభ్యులకు వ్యాపార సంస్థలకు అనుసంధాన కర్తగా ఇరువురి ప్రయోజనాలను కాపాడడం
తాయి బోర్డు ప్రస్తుతం ముగ్గురు సభ్యులతో కార్యవర్గానికి చేరువగా సలహాసంప్రదింపులను చేకూరుస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ క్రింద నుదహరించిన కార్యక్రమాలను చేపట్టాలన్న పట్టుదలతో వున్నారు.
· వివిధ రంగాల్లో నిష్ణాతులైన సభ్యులకు ఫోరమ్స్ ఏర్పాటు చేయడం
· విద్యార్ధులకు, క్రొత్తగా వచ్చే తెలుగువారికి తగు సహాయం అందివ్వడం
· యోగ, ట్రెక్కింగ్, యూత్ క్యాంప్స్ పై దృష్టిని సారించడం
గత ఏడాది శ్రీ గోపాల్ తంగిరాల అధ్యక్షతన కొనసాగిన కార్యవర్గానికి వారు అమలుపరచిన కార్యక్రమాలు మరియు ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరచిన తీరుకు కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ సభ్యులే కాకుండా తెలుగువారందరూ ఈ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేయాలని వ్యాపార సంస్థలు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకొని తాయికి సహాయన్నందివ్వాలని క్రొత్తగా ఎన్నికైన కార్యవర్గం కోరుకుంటోంది.
నూతన కార్యవర్గం వివరాలు:
అధ్యక్షులు: శ్రీ రామారావు మునుగంటి
ఉపాధ్యక్షులు: శ్రీ పవన్ మటంపల్లి
కార్యదర్శి: శ్రీ అలీ మొహమ్మద్
కోశాధికారి: శ్రీ శర్మ మాదిరాజు
సహాయ కార్యదర్శి: శ్రీ రాజశేఖర్ గురజ
సభ్యులు 1: శ్రీ శివ ప్రసాద రావు పసుమర్తి
సభ్యులు 2: శ్రీ రమేష్ పతి
సభ్యులు 3: శ్రీమతి సుమిత్రా కళ్యాణ్ ఎర్రమిల్లి
సభ్యులు 4: శ్రీ వెంకట మోటుపల్లి
బోర్డ్ మెంబెర్స్:
అధ్యక్షులు: శ్రీమతి అనూరాధ మునుగంటి
సభ్యులు 1: శ్రీ వెంకట దొడ్డి
సభ్యులు 2: శ్రీ రామారావు మునుగంటి (ప్రస్తుతం తాయి అధ్యక్షులు)