పిల్లలే ప్రమద గణాలు

VinayakaChavithi_2016_058VinayakaChavithi_2016_171

ఆది దేవుడు ఆనందానికి అవధులు లేవు. ఆనింద్యుడు అంబరమెక్కాడు. ఉమాసుతుడు ఉరికురికి వచ్చాడు.

మన దేశం కాని చోట పర సంస్కృతిని అక్కున చేర్చుకొని గౌరమ్మ తల్లి నలుగు పిండితో చేసిన బొమ్మకు జీవం పోసినట్లు మన సంస్కృతిని బుడి బుడి నడకల బుడతలతో ఏకంగా దివి నుండి భువికి ఏకదంతుని రప్పించిన కధనమిది. ముసి ముసి నవ్వుల మూషకరథుడు క్రీగంట చూపుతో బాలబాలికలు చేసిన విగ్రహాలను చూసి పడి పడి నవ్వుల జల్లులతో పచ్చగా పది కాలాలపాటు పరవశింపమని అక్షతలు జల్లాడు. తన పరివారము, ప్రమద గణాలు ఈ పిల్లలే అయితే ఎంత ముగ్ద మనోహరంగా ఉంటుందోనని తనలో తానే పరమానందభరితుడైపోయాడు.

VinayakaChavithi_2016-2

VinayakaChavithi_2016-1

మెల్బోర్న్ లోని గణేష్ ఉత్సవ కమిటీ వరుసగా తొమ్మిదవ ఏట నిర్వహించిన కార్యక్రమంలో ఎప్పటిలాగానే చిన్న పిల్లలకే పెద్ద పీట వేశారు. ఈ సంవత్సరం ఏకంగా బోజ్జదేవుని కధ – పుట్టుగనుండి పట్టాభిషేకం వరకు ఒక రూపకంగా రంగస్థల ప్రదర్శన చేయడం ఎంతో ముదావహం. తధగాతునికి ఇంతకన్నా అర్పించే భక్తి ఏముంటుంది? ఈ కార్యక్రమం చూసిన పార్వతీనందనుని పరవశానికి అంతేముంటుంది? కైలాసవాసుడు కదం త్రోక్కగా విశాలాక్షి ముదమొంద కుమార స్వామి ప్రణమిల్లి దేవతలందరికీ ఆది దేవుడై పట్టాభిషేకం పొందిన వేళ సభాసదుల కరతాళ ధ్వనుల మధ్య సభావేదిక అత్యంత దేదీప్యమానంగా వెలిగిపోయిందంటే నమ్మశక్యం కాదు.

VinayakaChavithi_2016-3

సత్సంప్రదాయంగా విఘ్నేశ్వరుని పూజలు జరిపించిన శ్రీ నరసింహ మూర్తిగారు అభినందనీయులు. గణేష్ చతుర్ధి నాడు వండే పిండి వంటలు – ఉండ్రాళ్ళు, వడపప్పు, కుడుములు, ఫలాలు – మారేడు పత్రి, జాజి పత్రి, వివిధ రకాలైన పుష్పాలు సేకరించి ఎంతో సుదరంగా సభావేదికనలంకరించి పిల్లలందరితో పూజా కార్యక్రమాన్ని చేయించడమే కాకుండా వారితో మట్టి బొమ్మలు చేయించడం మెచ్చ దగ్గ విషయం.

VinayakaChavithi_2016-5

VinayakaChavithi_2016-4

ఎప్పుడో చిన్నప్పుడు మనందరం ఏదో ఒక రకంగా పూజా కార్యక్రమంలో పాలుపంచుకోన్నాం కాబట్టే ఆ మట్టి వాసనలు మనలో భాగమైపోయి మన పిల్లలకు కూడా అందివ్వాలన్న తపన ప్రతీ తల్లిదండ్రి కళ్ళల్లో కనబడింది. గత మూడు నెలలుగా పిల్లలకు తగిన శిక్షణనిచ్చి రూపకాన్ని తీర్చి దిద్దటమే కాకుండా వారికి పూజా కార్యక్రమం అవగాహన కలిగించేలా ఒక పద్ధతిగా కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం.

VinayakaChavithi_2016_253 VinayakaChavithi_2016_116

సంగీత విభావరి, భారత నాట్యం, ఫాన్సీ డ్రెస్ మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఉచితంగా భోజనాలు శ్రీ రమణ మీసాల, రాధ కృష్ణ గార్లు అందించినందుకు గణేష్ ఉత్సవ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.

తెలుగువారి ఆత్మీయ బంధువు శ్రీ మురళి బుడిగె గారు ధ్వనికి కావలసిన ఏర్పాట్లు చేసారు. వారికి కూడా గణేష్ ఉత్సవ్ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.