ప్రేమానురాగాలకు ప్రతీక

rakhiమన భారత దేశం సంప్రదాయాలకు, పండగలకు అద్దం పట్టిన దేశం. సంబంధ బాంధవ్యాలకు పెట్టింది పేరు. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు జరుపుకునే రక్షాబంధన్ పండగ విషయానికి వస్తే ఆ రోజున సోదరసోదరీమణులు కలిసి చేసుకోవడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. సోదరీమణులు తమ సోదరుల చేతులకు రక్షా బంధనం కడతారు. తమ మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయత చెక్కుచెదరక కలకాలం ఉండాలన్నది ఈ రక్షాబంధనంలో ఇమిడిఉన్న అర్ధం. తమ సుఖసంతోషాలకోసమే తాము ఉన్నామని సోదరీమణులు సోదరుల నుంచి హామీ పుచ్చుకుంటారు. సోదరులు ఈ సందర్భంగా వారికి కానుకలు ఇచ్చి తధాస్తు అంటారు.

ఈ పండగను రాఖీ, రక్షా బంధన్, రాఖీ పౌర్ణమి అని వ్యవహరిస్తారు. ఈ పండుగ రోజునే కొన్ని ప్రాంతాల వారు శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని అంటారు.
.
ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో మాత్రమే ఈ పండగను జరుపుకునే వారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సంబరాలు చేసుకుంటున్నారు.

హిందూ పురాణాల ప్రకారం ఇందుకు సంబంధించి ఉన్న విషయాలను చూద్దాం…
– ఇంద్రుడు రాక్షసులను హతమార్చడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు అతని భార్య ఇంద్రాణి అతని చేతికి రక్షా బంధనం కట్టి విజయుడవై క్షేమంగా తిరిగిరావాలని చెప్తుంది.

– శ్రీ మహావిష్ణువు ఓ మారు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. అది లక్ష్మీ దేవికి గిట్టదు. ఆమె వెంటనే అక్కడికి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుంది. కనుకే ఈ రక్షాబంధానికి విశేష ప్ర్రాధాన్యం ఏర్పడింది.

– వినాయకుడి కొడుకులు శుభ్, లాబ్ ఓ మారు తమ తండ్రికి వాళ్ళ సోదరి రాఖీ కట్టడం చూస్తారు. వాళ్ళు కూడా తమకు సోదరి కావాలని, అప్పుడు తాము కూడా ఇలాగే రక్షాబంధన చేసుకుంటామని తండ్రిని కోరుతారు. పుత్రుల కోరిక మేరకు వినాయకుడు అగ్ని నుంచి ఓ కూతురిని సృష్టించి వారికి చెల్లినిస్తాడు. ఆమె పేరే సంతోషిమాత.

– ఓమారు శ్రీకృష్ణుడు ఓ గాలిపటం ఎగరేస్తుండగా అతని చేతికి గాయమవుతుంది. అది చూసి ద్రౌపది వెంటనే తన చీరలో నుంచి ఓ ముక్క చించి కృష్ణుడికి గాయమైన చోట కట్టు కడుతుంది. ఈ సంఘటనతోనే శ్రీకృష్ణుడు ద్రౌపదికి తానెప్పుడూ అండగా ఉంటానని మాట ఇచ్చి కౌరవ సభలో వస్త్రాపహరణం ఘట్టంలో ఆమె మానాన్ని కాపాడుతాడు.

ఇక చరిత్ర విషయానికి వస్తే
– యుద్ధంలో పురుషోత్తముడు అలెగ్జాండర్ ను చంపకుండా విడిచి పెట్టడానికి కారణం అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి రాఖీ కట్టమని పంపడమే.

– గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా దాడికి పాల్పడినప్పుడు తనకు రక్షణ కల్పించామని చిత్తూరు రాణి కర్ణావతి హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపుతుంది. అయితే హుమాయూన్ రావడంలో జరిగిన ఆలస్యంతో ఆ రాణి సుల్తాన్ దాడిలో మరణిస్తుంది. ఆమె ఆత్మశాంతికి సంకేతంగా హుమాయూన్ చక్రవర్తి బహదూర్ షాను యుద్ధంలో ఓడిస్తాడు. అంతే కాదు ఆ రాజ్యాన్ని రాణి కొడుకుకి అప్పగిస్తాడు.

– రక్షాబంధన్, రాఖీలోని పరమార్ధమే తనతో ప్రేమ, మర్యాద తదితర అంశాలపై సాహిత్య రచన చేయించిందని విశ్వకవి రవీంద్ర నాథ్ టాగోర్ చెప్పుకున్నారు. అంతేకాదు హిందువులు, ముస్లిముల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరియాలని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కూడా. బ్రిటీష్ పాలనపై నిరసన తెలపాలని హిందువులకు, ముస్లింలకు సూచించారు. రాఖీ మహోత్సవాన్ని బెంగాల్ ఐకమత్యానికి సంకేతంగా ఆయన ప్రారంభించారు.

– ఈ రక్షాబంధన్ రోజున దక్షిణ భారతదేశంలో జంధ్యాలు కూడా మార్చుకుంటారు.

Send a Comment

Your email address will not be published.