ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక పరిపాలనా కేంద్రంగా మంగళగిరి ఖరారయింది.
మంగళగిరిలో అమరావతి టౌన్ షిప్ నిర్మించాలని ఇంతకుముందే ఒక ప్రతిపాదన ఉంది. ఇప్పుడు అదే టౌన్ షిప్ లో సచివాలయం కూడా కట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో, సచివాలయాన్ని ఎక్కడ నిర్మిస్తారనే ఉత్కంటతకు తెరపడింది. రాష్ట్ర సచివాలయాన్ని గన్నవరంలో ఏర్పాటు చేయబోతున్నట్టు నిన్న మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. గుంటూర్ జిల్లా తుళ్ళూరులో నిర్మిస్తారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో, రాష్ట్ర పరిపాలనా కేంద్రంపై ఒక విధమయిన గందరగోళం నెలకొంది. ఈ గందరగోళానికి ప్రభుత్వం తెర దించింది. అమరావతి టౌన్ షిప్ లో రెండు అంతస్తుల ఫాబ్రికేటేడ్ భవనం నిర్మించనున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇలా వుండగా సింగపూర్ సంస్థలు కొత్త రాజధానికి సంబంధించి తుది నమూనాలను ప్రభుత్వానికి అందజేశాయి. కొద్ది మార్పులతో ప్రభుత్వం వాటిని ఆమోదించింది. అమరావతి నిర్మాణం కోసం మంగళగిరి నుంచి 26 కిలోమీటర్ల మేర రైతుల నుంచి సేకరించిన సుమారు 33 వేల ఎకరాల భూముల్లో ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణం ప్రారంభించబోతోంది.