ప్రముఖ సీనియర్ హాస్యనటుడు మాడా వెంకటేశ్వర రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న ఆయన అక్టోబర్ 24వ తేదీ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు .
ఆయన 1950 అక్టోబర్ 10వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కడియం పరిధిలోని దుళ్ళ గ్రామంలో జన్మించారు.
దాదాపు మూడు వందల యాభై చిత్రాల్లో నటించిన మాడా మొదట్లో నాటకాలు వేశారు. ఆ తర్వాతే సినీ రంగంలోకి వచ్చారు.
కొంతకాలం విద్యుత్ శాఖలో పని చేసిన ఆయనకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శకులు బాపు, దాసరి నారాయణ రావు. బాపు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా 1973 లో వచ్చిన అందాల రాముడు చిత్రంలో ఆయనకు మొదట అవకాశం వచ్చింది. ఆ తర్వాతా బాపు దర్శకత్వంలోనే ముత్యాలముగ్గు చిత్రంలో రెండు నిమిషాల పాటు కనిపించే బేరగాడి పాత్ర లో మాడా నటించిన తీరు మరచిపోలేనిది.
అయితే దాసరి దర్శకత్వంలో వచ్చిన చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రం తర్వాత మాడా తన కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆ చిత్రంలో మాడా పై చిత్రీకరించిన పాట “చూడు పిన్నమ్మ….పాడు బుల్లోడు ….” పాట ఆయనకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాట పాడిన ఎస్ పీ బాలసుబ్రమణ్యం కు కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది.
అక్కినేని, ఎన్టీఆర్, కృష్ణ, గుమ్మడి వెంకటేశ్వర రావు, అల్లూ రామలింగయ్య, శోభన్ బాబు తదితరులతో నటించిన మాడా ఎన్నడూ ఎవరి వద్దకు వెళ్లి తనకు అవకాశం ఇవ్వమని అడగలేదని అంటూ ఉంటారు. ఆయనను వెతుక్కుంటూ క్యారక్టర్లు వచ్చాయని చెప్తారు.
అభినవ కళానిదిగా సన్మానం పొందిన మాడా మరణవార్త సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్రసంతాపం తెలిపారు.