నన్ను కన్న తల్లీ, నేను పెరిగిన వూరూ చాలా మధురమైనవి! ఎన్ని సంవత్సరాలు విడిచి వున్నా మళ్ళీ కలిస్తే చెరగని, తరగని ప్రేమను పంచేవి ఈ రెండూ!
ఈమధ్యన ఇండియా వెళ్ళినప్పుడు మావూళ్ళో ఒక నాల్గు రోజులు గడిపే భాగ్యం కల్గింది. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళినా ఎంతో ఆత్మీయత కురిపించేరు మా వూళ్ళో అందరూ!
రిక్షా దిగిన వెంటనే ఊళ్ళో నలుగుర్నీ పలకరించడం మొదలు పెట్టేను.
మా ఇంటి ప్రక్కన పెద్ద కాపు హొటల్ మూసేసేరు. వాళ్ళ చిన్నమ్మాయి అనుకుంటాను ‘అబ్బాయిగారూ?’ అని పిలిచింది. చూసి ఆశ్చర్య పోయాను. ఎంతో పెద్దది అయి పొయింది. నేనింకా పలకరిస్తూంటే, ప్రక్కనే కిళ్ళీకొట్లోంచి ఒక సోడా తెప్పించేసింది.
అప్పటి వరకూ మినరల్ వాటర్ తప్ప ఏ నీళ్ళూ తాగకుండా జాగ్రత్త పడుతోన్న నేను, ఆరోజు ఆ ఆత్మీయతను చూసేసరికి సోడా నీళ్ళు త్రాగకుండా వుండలేకపోయాను.
ఆరోజు రాత్రి పోతాప్రగడ రామకృష్ణ ఇంట్లో మకాం. రామకృష్ణా నేనూ పదవ క్లాసు వరకూ కల్సి చదువుకున్నాం. వాళ్ళ నాన్నగారు మావూరి కరణం గా వుండేవారు. ఎన్ టీ ఆర్ గారి ధర్మమా అని కరణం, మునసబు పదవులు పోతే, రామకృష్ణ అక్కడే విలేజి డవలప్ మెంటు ఆఫీసరు గా చేస్తున్నాదు. కాని మేము వాణ్ణి కరణంగారు అనే పిలుస్తూ ఉంటాం. వూళ్ళో అందరికీ ఎంతో సాయం చేస్తూ ఉంటాడు.
ఇంతకీ మవూరు పేరు మీకు చెప్పనే లేదు. మాది గోపాలపురము. తూర్పు గోదావరి జిల్లా లో రాజమండ్రీ కి 32 కిలోమీటర్లు. మావూరి జనాభా 20 వేలు మాత్రమే! చాలామంది వ్యవసాయదారులే! బ్రాహ్మణుల వీధీలో మాకు ఒక ఇల్లు, మా మామ్మగారు కొన్న కొంత ఊడుపు చేను (పొలం) ఉన్నాయి. మావూరి లోనికి ప్రవేసిస్తూనే మీకు ఏం కనిపిస్తుందో తెలుసా? సర్ఆర్థర్కాటన్విగ్రహం. ఆశ్చర్యంగా లేదూ?
Sir Arthur Cotton’s Statue at the entrance of Gopalapuram
ఒకప్పుడు కోనసీమ ప్రజలు కరువు తో బాధపడుతూంటే, గోదావరి నదికి ఆనకట్ట నిర్మించి, కాలువల ద్వారా ఆ నీటిని కోనసీమ అంతా పారించి, అందరికీ బిక్ష పెట్టిన మహామనీషి కాటన్ గారు. ఇప్పటికీ చాలామంది వ్యవసాయదారులు కాటన్ గారి పటాన్ని దేముడి గూట్లో పెట్టి పూజిస్తారు.
మెయిన్ రోడ్డు మీద బస్సు దిగి, రిక్షాలో వూళ్ళోకి వస్తూంటే పచ్చటి వరి చేలు రెండు ప్రక్కలా కనిపిస్తాయి. వూళ్ళోకి ప్రవేసించేముందర లాకు మీదకి ఎక్కాలి. అక్కడ రిక్షా దిగి త్రొయ్యాలి. ఈ లాకు కూడా కాటన్ గారు కట్టినదే! రెండు ప్రక్కలా నిండు కాలవ ప్రవహిస్తూ ప్రశాంతంగా వుంటుంది.
Gopalapuram – Lock
రామకృష్ణ ఇంట్లో స్నానపానాదులు అయ్యేకా, అతని శ్రీమతి “దుర్గా కామేశ్వరి గారు” మంచి కాఫీ ఇచ్చేరు. తర్వాత అందరం కల్సి శివాలయానికి వెళ్ళాం. మావూరి శివుడిపేరు “శ్రీ ఉమా బలేశ్వర స్వామి” .
విశాలమైన ఆలయ ప్రాంగణం. పెద్ద నంది.
ఈ ఆలయంలో ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో చిన్నప్పుడు! స్కూలు నించి రాగానే, పిల్లలం అందరం గుళ్ళో కలిసేవాళ్ళం. గన్నేరు చెట్లమీద ఎక్కడం దూకడం, గుడి చుట్టూ ఒకళ్ళనొకళ్ళు తరుముకోవడం, అక్కదే గూటీ బిళ్ళ ఆడడం, ఆ వీధిలోనే మా మేనత్తగారింట్లో చిరుతిళ్ళు తిని ఇంటికెళ్ళడం- ఇదీ రోజువారీ కార్యక్రమం!
శ్రీ ఉమా బలేశ్వర స్వామి దేవాలయం ( శివాలయం) – గోపాలపురం
శివాలయంలో అర్చకులు శ్రీ శేషగిర్రావుగారు. పెద్దవారు అయిపోయినా, అదే అభిమానం. మా పిల్లలతో సహా అందరి పేర్లూ అడిగి అర్చన చేసేరు. అక్కడే కూర్చుని శివనామస్మరణ చేసుకుంటున్న పెద్దిరెడ్డిగారు పలకరించేరు : “మీరు భాస్కరం గారి అబ్బాయి కదూ?” అంటూ.. అడుగడుగునా పలకరింపులే.. అందరూ ఆత్మీయులే.. నిస్వార్ధమూ నిరాడంబరమూ ఐన ప్రేమ..
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం- గోపాలపురం
అక్కడినుంచి విష్ణాలయానికి (శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం) వెళ్ళాం. ఆచార్యులుగారి అబ్బాయి అనుకుంటాను.. అభిషేకం చేస్తున్నాడు.. దణ్ణం పెట్టుకుని బయటకు వస్తూంటే, డాక్టరు గారి భార్య పలకరించేరు.. మెల్లిగా రాత్రి 9 గంటలకి రామకృష్ణ ఇంటికి చేరాం. భోజనాలయ్యేకా ఆరుబయట మడత మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయాం.
మర్నాడు మా స్టూడెంట్స్ రీ-యూనియన్ (పాత విద్యార్ధుల సమ్మేళనం) జరిగింది. తొమ్మిది గంటలకి రంగన్న గారి వీధిలో వైశ్యుల సత్రం లో అందరం కలిశాం. 30 యేళ్ళ క్రితం కల్సి చదువుకున్న వాళ్ళం-ఒకళ్ళనొకళ్ళం గుర్తు పట్టలేకపోయాం. ఒకడు ఆర్మీ లో పని చేస్తుంటే, ఒకడు మావూళ్ళోనే ఫాన్సీ షాపు నడుపుతున్నాడు. ఇంకొకడు ( దీక్షితులు) అహమ్మదాబాదులో ఐ.ఐ.ఎం. లో రిజిస్త్రారు గా చేస్తున్నాడు. నేను ఆస్త్రేలియా చెక్కేసేను!
మా క్లాసు లో ముగ్గురమ్మాయిలు వుండేవారు. అందులో శ్రీ లక్ష్మి ఇప్పుడు జెడ్ పీ స్కూల్ లో హెడ్ మిస్ట్రెస్.
సహపంక్తి భోజనాలు
అందరికీ వేడి వేడి వుప్మా కాఫీ లు ఇచ్చేరు. ఒకళ్ళప్రక్కన ఒకళ్ళం కూర్చొని తింటూ ఎన్నో కబుర్లాడుకున్నాం. ఎన్ని జ్ఞాపకాలో!
“నువ్వు నా లెక్ఖలు పుస్తకం చింపేసేవు, గుర్తుందా?”
“ఒరేయ్, టెంత్ క్లాసు పబ్లిక్ పరీక్షల్లో నీ ప్రక్కనే కూర్చొని ఇంగ్లీషు పేపరు కాపీ కొట్టేనురా. నీకంటే రెండు మార్కులు ఎక్కువొచ్చాయి నాకు!”
ఈ కబుర్లతో ఎంత సందడిగా గడిచిందో!
హిందీ మాస్టారి ప్రక్కన కూర్చుని కబుర్లు
తర్వత అందరం కల్సి కాలవ గట్టునే నడుచుకుంటూ మా హై స్కూలుకెళ్ళాం.
అన్నట్టు మావూరి కాలవ సంగతి చెప్పడం మరిచేపోయాను. మేం ఉదయమూ సాయంత్రమూ ఈతలు ఆడుతూ కళ్ళు ఎర్రబడే వరకూ ములిగి తేలిన మా కాలవ ఎప్పుడూ నిండుప్రవాహం తో ఉంటుంది. ప్రక్కనే ఉన్న అరటి చేలలో బోదెలు తీస్కొచ్చి వాటిమీద తేలుతూ గంటలు తరబడి గడిపేవాళ్ళం.
మావూరి కాలవ
స్నానాల రేవు
దారి లో అందరినీ పలకరించుకుంటూ, ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆగి, కాలవ మెట్ల మీద కాళ్ళుకడుక్కొని దర్శనం అయ్యేకా ఇంకొంచెం దూరం లో మేం బఠాణీలు కొనుక్కునే కొట్టు దగ్గర ఆగి, అతన్ని పలకరించి మా స్కూల్లో ప్రవేశించాం. ఎంతో మారిపోయింది. మేం ఫుట్ బాల్ ఆడే గ్రౌండ్స్ లో కొత్త బిల్డింగులు కట్టేసేరు.
ZP High School – Gopalapuram
అందరం వీడియోలు, ఫొటోలు తీసుకుని, ఆడవాళ్ళను రిక్షాలు ఎక్కించి, మేం నడుచుకుంటూ తిరిగి సత్రం లో కి వచ్చాం.
ఈ ఫంక్షన్ కి హైదరాబాదు నుంచి మా లెక్ఖలమాస్టారు(ప్రసాద రావు గారు) , భార్యా వచ్చారు, పొడగట్లపల్లి నుంచి హిందీ మాస్టార్ని రిక్షాలో తీస్కొచ్చేరు. ఆయనకు యెనభై సంవత్సరాలు. గీతా ప్రెస్స్ కు హిందీ- తెలుగు అనువాదకులుగా ఎంతో సేవ చేసేవారు. పెద్దవారు అవడంతో, మాలో చాలా మందిని గుర్తు పట్టలేకపోయారు. రాజోలు నుంచి మా స్కూలు గుమాస్తా గారు, సతీ సమేతం గా వచ్చారు. మా స్కూలు అసిస్టెంటు ” ఆదినారాయణ” కూడా వచ్చేడు.
మా సీనియర్ విద్యార్ధి “గంగాచలం” మైక్ సిస్టం, లైట్లూ ఏర్పాటు చేశాడు.
రామకృష్ణ రెండు సెల్ ఫోన్లు రెండు చేతుల తోటీ రింగ్ చేస్తూ అన్నీ యేర్పాట్లూ చూస్తున్నాడు. ఈలోపులో కరెంటు పోయింది. ఎవరికో ఫోన్ చేసి జెనరేటరు తెప్పించేడు. ఏ ఆటంకం వచినా, నిరుత్సాహ పడకుండా ముందుకి వెళ్ళడం మా రామకృష్ణ ప్రత్యేకత!
మధ్యాహ్నం రెండు గంటలకి వేద ప్రవచనం తో ప్రారంభమైంది “గురు సన్మానం”. అందరు గురువులకూ చామంతి దండలు వేసి, శాలువాలు కప్పి సత్కరించేం. ఈ సామాగ్రి అంతా రామకృష్ణ “కడియపు లంక ” నుంచి తెప్పించేడు. “కడియపు లంక” పూల తోటలకి ప్రసిద్ధి.
గురు వందనం
గురువుల సముఖం లో అందరం మా కుటుంబాలగురించి చెప్పేం. మా డేవిడ్ మాస్టారు, బైబిల్ లోంచి కొన్ని సూక్తులు కూడా చదివేరు.
సాయంత్రం ఏడు గంటలకు అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ఎవరి గూళ్ళకు వాళ్ళం చేరుకున్నాం.
జీవితం అనే పుస్తకం లో ఒక మధుర మైన పేజి నిండిందీవేళ.