ఆస్ట్రేలియాలో తెలుగు వారు అంచెలంచెలుగా బహుళ సంస్కృతీ సంప్రదాయాలకు పట్టంకడుతూ తమకంటూ ఒక నిర్దిష్టమైన స్థానాన్ని నిలుపుకోవడానికి మరొక నిదర్శనం. తెలుగమ్మాయిగా పుట్టి పదహారణాల తెలుగుదనాన్ని తనలో నింపుకొని అచ్చ తెలుగు భాషను ఉచ్చారణ చేస్తూ ఆస్ట్రేలియా గగన వీధుల్లో తెలుగు బావుటాని తెలుగువారందరూ గర్వించేలా ఎగురవేయడం సరిక్రొత్త స్పూర్తిదాయకమైన వార్త.
తెలుగుమల్లిలో ఇంతకు మునుపు మన తెలుగు అమ్మాయిలు డా.సృజన, మనోజ్ఞా కామిశెట్టి గార్ల గురించి వారి ప్రతిభా పాటవాలు మనవాళ్ళకు ఎలా స్పూర్తినిస్తున్నాయో వివరించడం జరిగింది. అమెరికాలో కూడా తెలుగమ్మాయి మిస్ అమెరికాగా ఎన్నుకోబడిందని విన్నాం. అయితే మనమేమీ తీసిపోలేదని ఆస్ట్రేలియాలో కూడా తెలుగువారి అందచందాలకు కొదవలేదని శ్రీమతి లక్ష్మి మరియు శ్రీ సత్య ఇందుకూరి వారి జ్యేష్ట పుత్రిక శ్వేత “మిస్ ఇండియా-ఆస్ట్రేలియా” గా ఎన్నికై నిరూపించింది.
వివరాల్లోకెల్తే శ్వేత వాళ్ళ కుటుంబం ఆస్ట్రేలియా షుమారు 6 సంవత్సరాల క్రితం పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం మెల్బోర్న్ నగరం రావడం జరిగింది. RMIT విశ్వ విద్యాలయంలో Aero Space Engineering విద్యనభ్యసించి గత సంవత్సరం చైనా దేశంలో ఇంటర్న్ షిప్ మరియు ఒక అందాల పోటీలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో New Silk Road (NSR) Model Look Australia లో పాల్గొని ద్వితీయ స్థానం సంపాదించింది.
బాల్యం నుండి అందరికంటే వ్యక్తి గతంగా ఆలోచనా పరంగా భిన్నంగా వుండాలని పట్టుదలతో జీవితంలో తన చుట్టూ వున్న వనరులనుపయోగించుకొని తనంతట తాను ఎదిగి పైకి రావాలన్న బలీయమైన కోర్కె ఉండేదని శ్రీమతి లక్ష్మి గారు చెప్పారు. అయితే ఈ జీవితమనే ప్రయాణంలో అనుకున్నవన్నీ చేయలేనేమోనని కాలంతో పందెం వేసి అప్పుడప్పుడూ పరుగులు తీస్తుంటుందని కూడా చెప్పారు.
చదువుతున్న రోజుల్లో అవకాశం దొరకినప్పుడల్లా మన తెలుగు సంఘం మరియు ఇతర భారతీయ సంఘాల సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొని తనకు కళల పట్ల ఉన్న మమకారాన్ని చాటి చెప్పుకునేది శ్వేత. భారతీయ నృత్యమన్నా, సంగీతమన్నా తనకు ప్రాణం. శ్వేత చిన్నప్పటినుండి అందాల పోటీల్లో పాల్గొనడం మరియు మోడలింగ్ లో పాల్గొనడమన్నా ఎక్కువ ఆశక్తి చూపించేది.
పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన కళల్ని ఆరాధిస్తూ ఒక అద్వితీయమైన శిఖరాన్ని అధిరోహించాలన్న తపన తనలో ఎప్పుడూ అంతర్యుద్ధం చేస్తూనే ఉండేది. ఆ తపనే అందాల సుందరిగా రూపు దిద్దుకొంది. తనకి దేవుడిచ్చిన అందంతో పాటు తనపై ఉన్న నమ్మకాన్ని జతచేసి తన పట్టుదలకు సాన పెట్టి ఈ తారా లోకంలో ప్రధమ స్థానాన్ని సంపాదించ గలిగింది.
ఈ నెల 15 వ తేదీ నుండి దుబాయ్ లో జరగబోయే మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2014 కార్యక్రమంలో ఆస్ట్రేలియా తరఫున పాల్గొనడానికి వెళ్తుంది. ఈ పోటీలో షుమారు 40 దేశాల నుండి గెలుపొందిన వారు పాల్గొనబోతున్నారు. శ్వేత ఈ పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ గా గెలుపొందాలని తెలుగుమల్లి అకాంక్షిస్తుంది.