యశ్‌పాల్‌ ఇక లేరు

Scientist Yash Palప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ యశ్‌పాల్‌ తుదిశ్వాస విడిచారు.

అంతరిక్ష శాస్త్ర అధ్యయనంలో యశ్‌పాల్‌ చేసిన కృషి ఇంతా అంతా కాదు.

మేలి మలుపు వంటి కాస్మిక్‌ కిరణాల పుట్టుపూర్వోత్తరాల అధ్యయనంలో ఆయన యెనలేని కృషి చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న యశ్‌పాల్‌ తన తొంభయ్యో ఏట వయో సంబంధిత అనారోగ్యంతో జూలై ఇరవై నాలుగో తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో నోయిడాలోని మాక్స్‌ ఆస్పత్రిలో కన్నుమూసారు. ఆయన అంత్య క్రియలు జూలై 27 వ తేదీ మధ్యాన్నం 3 గంటల సమయంలో లోధి రోడ్డులోని విద్యుత్‌ దహన వాటికలో నిర్వహించారు.

ఈ విషాదకర సమాచారాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖలోని బయో టెక్నాలజీ విభాగంలో శాస్త్రవేత్తగా ఉంటున్న యశ్‌పాల్‌ కుమారుడు రాహల్‌ పాల్‌ తెలిపారు.

1926 లో ఆయన ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న ఝంగ్‌ జిల్లాలో పుట్టారు.
ఆయన అమెరికాలోని ఎంఐటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. యశ్‌పాల్‌ కెరీర్ టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ సంస్థతో ప్రారంభమైంది.

అంచెలంచెలుగా ఎదిగిన ఆయన పరిశోధన భారీ స్థాయిలో కొనసాగింది.

అహ్మదాబాద్‌లోని అంతరిక్ష కేంద్రానికి డైరెక్టర్‌గా, ప్లానింగ్‌ కమిషన్‌కు చీఫ్‌ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశారు. యూజీసీ చైర్మన్‌గానూ సేవలందించారు. ఈ క్రమంలోనే ఆయన భారత విద్యావ్యవస్థ అభ్యున్నతికి కూడా అనేక కొత్త ఆవిష్కరణలు రూపొందించారు.

కాస్మిక్‌ కిరణాల అధ్యయనంలో ఆయన చేసిన కృషికిగాను దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ అవార్డును అందుకున్నారు.

యశ్‌పాల్‌ మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తమ సంతాప ప్రకటనలో తెలిపారు.

భారత దేశానికి చివరిదాకా సేవలందించిన సమర్ధుడైన శాస్త్రవేత్తను జాతి కోల్పోయిందని ఆయన తమ ట్విట్టర్‌ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు.

మంత్రి హర్ష వర్ధన్‌ మాట్లాడుతూ సైన్స్‌ అభ్యున్నతికి యశ్‌పాల్‌ చేసిన కృషిని గుర్తుచేశారు. ఆయన భౌతికంగా దూరమైనా శాస్త్ర సాంకేతికత పరంగా ఈ జాతికి అనునిత్యం వెన్నంటే ఉంటారని మంత్రి హర్షవర్ధన్ సంతాప సందేశంలో తెలిపారు.

శాస్త్ర సాంకేతిక శాఖ సెక్రటరీ విజయ్‌ రాఘవన్‌ మాట్లాడుతూ డాక్టర్‌ హోమీ జే భాభా, డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ల తరానికి చెందిన తార యశ్‌పాల్‌ గగనానికి చేరిపోయిందని తెలిపారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తదితరులు కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు.

Send a Comment

Your email address will not be published.