రెండక్షరాల నాన్న

ఫాదర్స్ డే సందర్భంగా…

రెండక్షరాల “నాన్న” అన్న పిలుపులో వుంది నవ్యత
తన అరచేతిలో నా జాతకం వ్రాసి ఆశీర్వదించిన భవిత
కన్నీరైనా మున్నీరైనా కంటి రెప్ప దాటనివ్వని గంభీరత
బురద బుగ్గి మట్టి దుమ్ముకి అడ్డుగ నిలచిన దేహకర్త

జీవన సమరంలో గెలుపే గానీ అలుపెరుగని మహా యోగి
పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడిన త్యాగి
రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలను చూసి ఆనందించే భోగి
నిశ్శబ్ద ఆవేదనలో సంస్కారాన్నందించిన సాంప్రదాయాల విరాగి

చిటికెని వేలు పట్టుకొని చిరుమందహసంతో ఓ నామాలు దిద్దించిన అధ్యాపకుడు
మా జీవిత దివ్వెలను వెలిగించి కొవ్విత్తిగా కరిగిపోయిన ఆత్మ బంధువు
మండుటెండలో జడివానలో నడకనేది మరచి పరుగులిడిన కృషీవలుడు
వయసు మీదపడి జవసత్వాలుడిగినా జగమెరిగిన విద్యాపారంగతుడు

మీరిచ్చిన ప్రేమ కుసుమాలు మాలో ఉంటాయి దండుగా
వాటిని మా గుండెల్లో ఎప్పుడూ నిలుపుకుంటాము మెండుగా
మదిలో మీ జ్ఞాపకాల చప్పుళ్ళు ఎప్పుడూ ఉంటాయి నిండుగా
మీ బోసి నవ్వుల శబ్ద తరంగాలు మాకొక పండుగ

–మల్లికేశ్వర రావు కొంచాడ

Scroll to Top