విజయవాడ, గుంటూరు నగరాల మధ్యే రాజధానిని నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం నిర్ణయించింది. ఆ తరువాత దీనికి రాష్ట్ర శాసనసభ కూడా మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. కొత్త రాజధాని నిర్మాణం కోసం 50 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కృష్ణ, గుంటూరు జిల్లాలలో ముఖ్యంగా నూజివీడు, దొనకొండ ప్రాంతాల్లో కూడా అవసరమయితే స్థల సేకరణ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థల పరిశీలనా, సేకరనలకి మంత్రులతో కమిటీని వేసింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాజధానిలోనే ఉంటాయని, అయితే, పరిశ్రమలు, విద్యా సంస్థలను మాత్రం వికేంద్రీకరించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని నిర్మాణానికి మంత్రి వర్గం ఏకాభిప్రాయం తెలిపింది. దీనితో, దొనకొండ ప్రాంతంలో రాజధానిని నిర్మించాలంటూ శివరామ కృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులకు ఉద్వాసన చెప్పినట్టయింది. కొత్త రాజధాని నిర్మాణానికి సుమారు లక్షా 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలవని అంచనా.