పాస్ పోర్ట్ సేవలను నగరాలకు మాత్రమే పరిమితం చేయకుండా వీటిని చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, మహబూబ్ నగర్, రాజమండ్రి, విశాఖ, వరంగల్ వంటి ప్రాంతాల్లో కూడా త్వరలో పాస్ పోర్ట్ కేంద్రాలు వెలిసి అవకాశం ఉంది. అంతే కాక నగరాల్లో కూడా ఇకపై పాస్ పోర్టుల కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రజలందరికీ పాస్ పోర్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చెందుకు ప్రభుత్వం ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అంటే ఇక నుంచి తపాలా కార్యాలయాల్లో కూడా పాస్ పోర్ట్ లభిస్తుందన్న మాట. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, సిద్ధిపేట, నల్లగొండ పట్టణాల్లోని తపాలా కార్యాలయాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణ, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం పట్టణాల్లోని తపాలా కార్యాలయాల్లో అతి త్వరలో ఈ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.