ఆశ్వయుజ మాసం అమ్మవారితో పాటే వస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించుకుని పదవ రోజైన దశమిని విజయ దశమిగా జరుపుకుంటాం. మొదటి నవరాత్రులపైనే పదో రోజుకి విశిష్టత వస్తుంది. మొత్తంమీద ఈ పది రోజులను దశరాత్రగా పరిగణిస్తారు. దీనిని “దశహరా” అని చెప్పుకుంటారు. దీనినే మనం తెలుగులో దసరా అని తెలుగులో అని చెప్పుకుంటాం. మొత్తంమీద ఈ దసరా పండుగ పది రోజులూ పర్వదినాలుగా భావించాలి.
నవరాత్రులలో దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి. అలా చేస్తే ఏడాది పొడవునా అమ్మవారిని పూజించినంత ఫలితం లభిస్తుంది. నవరాత్రులలో పూజించే నవ దుర్గాలకు సంబంధించిన శ్లోకాలు ఇవే –
“ప్రథమా శైలపుత్రీతి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్ర ఘంటేతి, కూష్మాండేతి చతుర్ధకీ
పంచామాస్కందమాతేతి, షష్టాకాత్యా నీతిచ
సప్తమా కాల రాత్రీతి, మహాగౌరీతి చాష్టమీ
నవమా సిద్ధిధాత్రీతి, నవదుర్గా ప్రకీర్తతాః”
నవదుర్గలలో మొదటిది శైలపుత్రి. ఈమె హిమవంతుడి కుమార్తె. వాహనం వృషభం. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి.
బ్రహ్మచారిణి – ఈమె శివుడిని పతిగా చేసుకోవాలని తపించిన నాగరాజ కన్య. బ్రహ్మచారిణి శుభకరం. ఈ దేవి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ఉంటాయి.
చంద్రాఘంటా – మాటలకందని లావణ్యవతి. నిత్యానందరూపిణి. శాంతిప్రదమైన రూపం.
కూష్మాండ – ఈమె జగన్మాత. ఈమెకు ఎనిమిది భుజాలు ఉంటాయి. ఎనిమిది చేతుల్లో కమండలం, బాణం, ధనుస్సు, కమలం, అమృతకలశం, చక్రం, గద, జపమాల వంటివి ఉంటాయి. కూష్మాండ బాలి అనగా గుమ్మడి కాయ మహా ఇష్టం. ఈమెను అర్చించి ఆరాధించడం వల్ల ఆరోగ్యం, భాగ్యం కలుగుతాయి.
స్కందమాత – ఈ తల్లి చరాచర జగత్తుకే తల్లి. మూలపుటమ్మ. స్కండుడైన కుమారస్వామి తల్లే స్కందమాత. ఈమెకు నాలుగు భుజాలు ఉంటాయి. ఒక చేతిలో బాలస్కందుడు, మరో చేతిలో పద్మం, ఇంకొక చేతిలో కమక్కమ్, మరో చేతిలో అభయముద్ర ధరించి ఉంటుంది ఈ తల్లి.
కాత్యాయిని – ఈమె కుతుడు అనే ముని పున్గావుడి ఆశ్రమంలో పుట్టిపెరిగింది. గోపికలు శ్రీకృష్ణుడిని తమ భర్తగా చేసుకోవడానికి యమునా నదీ తీరాన ఈమెను పూజించారు. ఈమె కూడా నాలుగు భుజాలు కలిగిన తల్లే. అభయముద్ర, వరముద్ర, ఖడ్గం, పద్మం నాలుగు చేతుల్లో ఉంటాయి.
కాళరాత్రి – ఈ తల్లి అంటే మృత్యువుకే భయం. యముడిని సైతం ప్రళయకాలంలో నశింప చేసే మూలశక్తి కలిగిన అమ్మగా ప్రసిద్ధి.
మహాగౌరి – ఈమె నల్లటి వర్ణంలో పుట్టింది. పరమేశ్వరుడు ఈమెను కాళీ అని పిలుస్తుండేవాడు. ఈమె బ్రహ్మను గురించి తపస్సు చేసి నల్లని దేహకోశాన్ని వీడి తెల్లని మేనితో మహాగౌరి అయ్యింది. ఈమె కుడి చేతులలో అభయముద్ర, శూలం ఉంటాయి. ఎడమ చేతులలో వరముద్ర, డమరుకం ఉంటాయి. వాహనం వృషభం.
సిద్ధిధాత్రి – అష్ట సిద్దులనూ ప్రసాదించే తల్లి. ఈమె వాహనం సింహం. శంఖం, కమలం, ఈమె చేతులలో ఉంటాయి. ఈమె ఆసనం కమలం.
అమ్మవారిని మొదటి రోజు నుంచి పది రోజులపాటు పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. ఏ రోజుకా రోజు నైవేద్యం సమర్పించాలి. పొంగలి, పులిహోర, కొబ్బరిపాలతో చేసిన అన్నం, గారెలు, దధ్యోదనం, కేసరి, వివిధ కూరలతో చేసిన అన్నం, చక్రపొంగలి, పరమాన్నం, లడ్డూ వంటివి చేసి నైవేద్యంగా పెట్టాలి.
దుర్గాదేవి నామాన్ని స్మరిస్తూ ఆ అమ్మ కృపకు పాత్రులు కావాలి. ఆమె అందరికీ మేలు చేసే అమ్మ. జగజ్జనని.