శివుడు నిర్గుణుడు. నిర్మలుడు. నిరంజనుడు. నిరాకారుడు. నిరాశ్రయుడు. నిరతిశయ అద్వైత పరమానంద స్వరూపుడు. పరమేశ్వరుడు చైతన్య స్వరూపుడు. ఆదిదేవుడు.
అట్టి ఆది దేవుని మొదటి భార్య సతీ దేవి (దక్షుడు కుమార్తె గనుక దాక్షాయణి అని కూడా అంటారు) కారణాంతరాల వలన అగ్నికి ఆహుతి అయితే సతీవియోగానికి తాళలేక హిమాలయాలలోని “ఓషధీ” ప్రస్థంలో ఘోర తపమొనర్చి పార్వతిని పరిణయమాడిన దృశ్య ఖండ కావ్యం “శ్రీ పార్వతీ కళ్యాణం” రంగస్థలం పై అత్యంత వైభవంగా ప్రదర్శించ బడుతోంది. “హేవళంబి” ఉగాది సందర్భంగా తెలుగుమల్లి మరియు భువన విజయం “దక్ష యజ్ఞం” మరియు “పార్వతీ కళ్యాణం” కలిసి (ఈ రెండు ఘట్టాలు కలిసి ఇదివరకెన్నడూ ప్రదర్శింప బడలేదు) ప్రదర్శించడం మహాదానందమైన విషయం. ఈ దైవ కార్యానికి షుమారు 40 మంది పాత్రదారులు గత రెండు నెలలుగా రిహార్సల్స్ చేస్తూ మహా యజ్ఞంగా భావిస్తూ గొప్ప రంగస్థల ప్రదర్శనగా ముద్ర వేయాలని అహర్నిశలూ కష్టపడుతున్నారు.
ఎంతోమంది ఆనందోద్వేగాలతో ఎదురు చూసే ఈ ప్రదర్శనకు మీకు సకుటుంబ సమేతంగా ఇదే సాదర ఆహ్వానం. మీ రాక మాకు ఎంతో ఆనందం. తప్పకుండా వచ్చి తెలుగు నాటక రంగంలో అపూర్వమైన రంగస్థల ప్రదర్శన తిలకించి ఆస్వాదిస్తారని ఆశిస్తూ…