సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
పద్మపాత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణనీ
నిత్యం పద్మాలయాం దేవీ సామాంపాతు సరస్వతీ….
సరస్వతి చదువుల తల్లి. వాగ్దేవి. సరస్వతి ఓ నదీమతల్లి. గంగ, యమునలలా పవిత్రమైన నది సరస్వతీ నది. బ్రహ్మ భార్య. బ్రహ్మ ఆమెను సృష్టించి తన భార్యగా చేసుకున్నాడు అన్నది ఓ కథనం. సరస్వతి బ్రహ్మ నుదుటి నుండి ఉద్భవించినట్టు చెప్తారు. ఆమె అందానికి ముగ్ధుడైన బ్రహ్మ తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కానీ సరస్వతి అందుకు ఒప్పుకోదు. అయితే బ్రహ్మ ఊరుకోకుండా ఆమె ఎటువైపు వెళ్తే ఆవైపు చూడటానికి వీలుగా ఒక్కో శిరస్సుని సృష్టించుకుంటాడు. సరస్వతి ఆ విధంగా అతనిని చతుర్ముఖుడిని చేసింది. అప్పుడు ఆమె అతని కోరికను గ్రహించి పెళ్లి చేసుకుంటుంది.
సరస్వతికి అనేక పేర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని –బ్రాహ్మి, భారతి, భాష, గీత. వాణి. శారద. వర్నమాత్రిక ఇత్యాది నామాలు. సరస్వతిని శరదృతువులో పూజించడం కద్దు.
ఆమె వాహనం హంస. సుందరమైన రూపం గల సరస్వతి చేతిలో వీణను చూడవచ్చు. అందుకే ఈమెను వీణాధారి అని కూడా అంటారు.
సరస్వతి ఒక చేతిలో పద్మం, మరో చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో కమండలం ఉంటుంది. కొన్ని చోట్ల ఈమె చేతిలో పద్మం కాకుండా రుద్రాక్షమాల ఉంటుంది. ఒక చేతిలో చిలుక ఉంటుంది.
సరస్వతి స్తన ద్వయాలుగా సంగీతాన్నీ, సాహిత్యాన్నీ అభివర్ణిస్తారు. ఈమె కమండలంలోని నీటిని జ్ఞానానికి శక్తిగా భావిస్తారు.
ఇలా ఉండగా, ఓమారు బ్రహ్మ గంగ వంక తదేకంగా చూస్తాడు. ఈ విషయం తెలిసి సరస్వతికి కోపం వస్తుంది. అప్పుడు గంగను నదిగా మారిపోవాలని శపిస్తుంది.
ఇక, సరస్వతి నదిలో నుంచి ఓ కొడుకు పుట్టిన వైనాన్ని చూద్దాం….
పూర్వం దధీచి అని ఓ రుషి ఉన్నాడు. చ్యవనుడి పుత్రుడైన దధీచికి ఇంద్రుడు కొన్ని విద్యలు నేర్పుతాడు. అయితే ఆ విద్యలను ఎవరికీ చెప్పకూడదని ఓ నియమం ఉంది. అయితే అశ్విని దేవతలు బలవంతంగా ఇతనితో ఆ విద్యలు చెప్పించుకుంటారు. దానితో ఇంద్రుడు శపిస్తాడు. ఆ శాపానికి దధీచి తల తెగిపోతుంది. అప్పుడు అశ్వినీ దేవతలు ఆ తలను దధీచికి మళ్ళీ అతికిస్తారు. కానీ ఇంద్రుడు ఆ విషయం తెలిసి ఆ తలను తొలగిస్తాడు. అశ్వినీ దేవతలు ఊరుకోరు. దధీచికి అసలు తలనే తగిలిస్తారు అశ్వినీ దేవతలు.
ఒకసారి దధీచి సరస్వతీ నది దగ్గర కఠోరమైన తపస్సు చేస్తాడు. ఈ తపస్సు చూసి ఇంద్రుడు జడుస్తాడు. దధీచి తపస్సుకి భంగం కలిగించాలనుకుని ఓ అప్సరసను దధీచి దగ్గరకు పంపుతాడు. ఆమెను చూడటంతోనే దధీచికి వీర్య స్ఖలనం జరుగుతుంది. ఆ బిందువు సరస్వతి నదిలో పడుతుంది. అప్పుడు ఆ నదిలోంచి ఒకడు పుడతాడు. అతని పేరు సారస్వతుడు. ఈ సారస్వతుడి వల్ల అనావృష్టి భయం దరి చేరాడని దధీచి అంటాడు. దధీచి మాటగా సారస్వతుడు పలువురి మెప్పు పొందుతాడు.
సరస్వతికి కాస్త కోపంపాలు ఎక్కువే. అది ఆమె లక్షణం. తన దారికి ఎవరైనా అడ్డు వస్తే ఆమె గట్టిగానే తన వాక్పటిమతో అడ్డుకుంటుంది. ఆమె ప్రధాన ఆయుధం వాక్కే. కనుకే మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని అనుభవిజ్ఞుల మాట.
అందుకే, మహాకవి పోతన తనలోని జడత్వాన్ని పోగొట్టి తనను రక్షించాలని ప్రార్ధించాడు.
ఏదేమైనా సరస్వతి దేవీ తన చల్లని చూపులతో అందరికీ చక్కటి విద్యను ప్రసాదించాలి.