సహనానికి ప్రతీక శ్రీరాముడు

Sri Rama Navami

విశ్వంలో గ్రహ నక్షత్రాదులన్నీ ఆయా స్థానాల్లో పదిలంగా ఉండడానికి కారణం పరమాత్ముని సహన శక్తే. ఆయా గ్రహాలను వాటి వాటి స్థానాల్లో తన ఆకర్షణ శక్తితో శాసిస్తున్నాడు. పృథ్వి ఈ సహన శక్తితో మహా పర్వతాలను నదీనదాలను అపారమైన ప్రాణికోటిని ధరిస్తోంది. తట్టుకోగల శక్తే పట్టుకోగలదు. ఈ సహన శక్తినే క్షమా అని భూమికి పేరు వచ్చింది.

వాల్మీకి శ్రేరాముడిని వర్ణిస్తూ క్షమయా పృధివీ సమ: అని పేర్కొన్నాడు. సహనంలో శ్రీరాముడు భూమితో సమానుడు అని అర్థం. ఇక సీత భూపుత్రిగా ఆ ఓరిమినే ప్రదర్శించింది.

కష్టకాలం వచ్చినప్పుడు ఓరిమి చాలా ఉపకరిస్తుంది. ధర్మ గుణాలలో ఓరిమి ఒకటి. దైవ గుణాలలో గీతాచార్యుడు తేజ: క్షమా ధృతి, శౌచం అని వివరించాడు.

కైకేయి మాటను గ్రహించి పితృ సత్యాన్ని నిలబెట్టడానికి వనవాసాన్ని సహించాడు శ్రీరాముడు.

తద్వారా ఋషుల రక్షణ వంటి ఘన కార్యాలు సాధించాడు. శబరి వంటి భక్తులు ఓరిమితో యోగాన్ని కొనసాగించి రామ దర్శనం అనే ఫలాన్ని పొందారు.

మనస్సు ఉద్రేకాల నిలయం. ఉద్వేగాల వలయం. బయటి పరిస్థితులకు స్పందించి వెంటనే ఉద్రేకపడే వాడు ఆ ఉద్రేకంలో జరిగిన చిన్న పొరపాటుకి బహుకాలం దుష్ఫలితాలు అనుభవించక తప్పదు. కామం, క్రోధం, శోకం ….ఈ మూడూ ఉద్రేక హేతువులు. ఇవి చెలరేగినప్పుడు ఓరిమి వహించడం విజ్ఞత.

సీతమ్మ స్వయంగా రావణుని దగ్ధం చేయగలిగి కూడా మొత్తం రాక్షష వంశ నిర్మూలన శ్రీరాముని ద్వారా కలిగించాలని సహనాన్ని వహించింది.

రామ సంకల్పం ఎరిగి హనుమంతుని సైతం సహనంతో ఉండమని బోధించింది.

ఓరిమికి కూడా ఒక హద్దు ఉంటుంది. ధర్మం అనే పరిధిలో దానిని నిర్వచించాలి. హద్దు దాటిన ఓరిమి అధర్మం అవుతుంది.

రావణుడు సీతను అపహరిస్తే శ్రీరాముడు ఓరిమిని చూపలేదు. క్రోధం వస్తే కాలాగ్ని సముడు అని రాముడు నిరూపించాడు.

సీతను రాక్షషుడేవరో పర్ణశాల నుంచి అపహరించాడని తెలిసి శ్రీరాముడు క్షణకాలం సహనం కోల్పోతాడు. బ్రహ్మాస్త్రాన్ని సంధించి కోపంతో రాక్షస జాతినంతా సంహరిస్తానని అన్నప్పుడు సౌమిత్రి వశిష్టుడి గురించి ప్రస్తావించి శ్రీరాముని శాంత పరుస్తాడు.

రాముని సహనం వల్ల హనుమ వంటి బంటు లభించాడు. సుగ్రీవుని వంటి స్నేహితుడితో సహచర్యం దొరికింది.

విభీశణుని వంటి యోగ్యుడు లంకకు రాజయ్యాడు. ఆనాడు శ్రీరాముడు సహనం వహించినందువల్ల సీతమ్మ క్షేమంగా తిరిగి రాగలిగింది.

సహనం, సమత్వం, ఆత్మవిశ్వాసం, ఓర్పు, మనలో అలవడినప్పుడే జీవితాలు శాంతిమయమవుతాయి.

ఓర్పుతో సమస్త లోకాలనీ వశపరచుకోవచ్చు. ఓర్పుతో సాధించలేనిది ఏదీ లేదు. ఎవరి చేతిలో క్షమా అనే ఖడ్గం ఉంటుందో వారికి దుర్మార్గుడు కూడా హాని చేయలేదు. ఈ విషయంలో శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు సాగాలి.
– తలశిల మహిమ

Send a Comment

Your email address will not be published.