హరికథ పితామహుడు ఆదిభట్ల

Adibhatla Narayana Dasuనిజానికి హరికథ ప్రక్రియకు ఆయన ఆద్యుడు కాకపోయినా రసికలోకం ఆయనను హరికథ ప్రక్రియలో పితామహుడిగా అభివర్ణించింది. ఆయనే – ఆదిభట్ల నారాయణ దాసుగారు. ఆయన హరికథ పాండిత్యాన్ని మరిదేనితోనూ తూయలేం. ఓ సగటు మనిషి సాహిత్య అభిరుచికి శ్రవణ తత్వం ప్రధాన బీజం. అయితే అది వినసొంపుగా ఆసక్తికరంగా ఉండడమే కాకుండా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేసిన ప్రజ్ఞ ఆయనిది. తన గానంతో విషయ పాండిత్యంతో ప్రేక్షకులను రంజింప చేసిన వారిలో నారాయణ దాసుగారిది అందెవేసిన చెయ్యి అనడానికి ముందు వెనుకలు ఆలోచించక్కర్లేదు. ఆయన హరికథను అనేక విధాలుగా అభివృద్ధి చేసి దాని బహుళ ప్రచారానికి ముఖ్యకారకులయ్యారు. ఆయన హరికథ పండితులకే కాదు పామరులకు కూడా ఆనందదాయకం.

1864 ఆగస్టు 31వ తేదీన శ్రీకాకుళ మండలం సువర్ణముఖీ నదీతీరాన గల అజ్జాడ అనే గ్రామమంలో జన్మించిన నారాయణ దాసు గారి అసలు పేరు సూర్యనారాయణ.

తన అక్షరాభ్యాసం గురించి తన సోదరి మనవడితో ఓసారి మాట్లాడుతూ మూడు మనువులు వెళ్ళి నాలుగవ మనువునకు సిద్ధంగా ఉన్న ఆడదానికి పెండ్లి చేసేటట్లు సాగిందన్నారు నారాయణదాసు.

ఆయన 46 గ్రంథాలు రాశారు. వాటిలో హరికథలు పద్నాలుగు. అవి,
ధ్రువచరిత్రము. అంబరీష చరిత్రము. గజేంద్ర మోక్షము. రుక్మిణీ కల్యాణము. ప్రహ్లాద చరిత్రము. శ్రీహరికథామృతమ్. గోవర్థనోద్ధరణము. భీష్మచరిత్రము. సావిత్రి చరిత్రము. యథార్థ రామాయణము. జానకీ శపథము. హరిశ్చంద్రోపాఖ్యానము. మార్కండేయ చరిత్రము. గౌరప్ప(మ్మ) పెండ్లి.

ఈ గ్రంథాల శీర్షికను బట్టే వాటిమూలకథ ఎందులోనిదో తెలసుకోవచ్చు. పురాణాల నుంచి తీసుకున్న కథలనే ఆయన హరికథలుగా మనముందుంచారు.

ఆయన ధ్రువచరిత్ర హరికథను రాసింది 1883లో. అంబరీష చరిత్రము రాయడానికి ముందు వరకూ ఆయన ఈ ధ్రువచరిత్రనే హరికథగా చెప్తుండే వారు. ఈ ధ్రువచరిత్రను ఆయన అచ్చువేయలేదు. వ్రాతప్రతిపై కూడా ఆయన అంతగా శ్రద్ధ చూపలేదు. బహుశా ఇది ఆయన ప్రథమ గ్రంథం కావచ్చు. అంతేకాదు, వారి శిష్యులు కూడా దీనిని నేర్చుకోలేదు. ఏదేతైనేం ఇది అలభ్య గ్రంథంగా మిగిలిపోయింది.

నారాయణ దాసు మామూలు హరిదాసులలా ఇతరులు రాసిన హరికథలు చెప్పి తరువాత హరికథలు రాయలేదు. హరికథలు చెప్పాలని అనిపించినప్పుడు ఆలోచన మెరసినప్పుడు ఆ క్షణంలోనే హరికథను రాసేవారు. తమ హరికథనే మొదటి నుండి ప్రదరర్శిస్తూ వచ్చారు. అందుకే ఆయన హరికథకుడిగా ఈ ధ్రువచరిత్ర కథ తొలి హరికథా ప్రదర్శనంగా ప్రారంభమైంది. ఈ హరికథే ఆయన హరికథక జీవితానికి మొట్టమొదటిదైంది.

ఇతర గ్రంథాలలో ఆయన రాసిన చివరి గ్రంథం తల్లి విన్కి. 1943 – 45 మధ్యకాలంలో లలితాసహస్ర నామాలనే ఈ శీర్షికతో రాసారు.

1945లో దాసుగారి దౌహిత్రుడైన (కుమార్తె కొడుకు – మనుమడు) ఉపాధ్యాయుల సూర్యనారాయణకు మశూచికం వచ్చింది. దాసుగారు అప్పుడు మనవడిని చూసి “తాతా, ఈ వ్యాధి నిన్ను విడిచి నాకు వస్తే బాగుండేది కదా” అని చెప్పారు. ఆయన వాకం శుద్ది బలమో లేక దైవ నిర్ణయమో గానీ మనవడికి మశూచికం తగ్గింది. దాసుగారికి జ్వరం వచ్చింది. క్రమంగా ఆ జ్వరం తీవ్ర రూపం దాల్చి దాసుగారు 1945 జనవరి రెండో తేదీన తుది శ్వాస విడిచారు.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.