అంతర్జాతీయ ఐటి దిగ్గజం గూగుల్ సంస్థ హైదరాబాద్ నగరానికి చేరుకుంది.
ఆసియాలో మొదటిసారిగా తన సొంత క్యాంపస్ ఏర్పాటుకు భాగ్య నగరాన్ని ఎంచుకుంది. అంతే కాదు, అమెరికాను మినహాయిస్తే ప్రపంచంలోనే అతి భారీ క్యాంపస్ ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని అది నిర్ణయించుకుంది.
ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణా ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. గూగుల్ తరఫున ఆ సంస్థ ప్రెసిడెంట్ డేవిడ్ రాడ్ క్లిఫ్ సంతకం చేసారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో 7.2 ఎకరాల స్థలాన్ని తెలంగాణా ప్రభుత్వం ఇందుకు కేటాయించబోతోంది. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అది ఏర్పాటు అవుతుంది. సంస్థ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి దీని మీద పెడుతోంది. సుమారు 6,500 మందికి ఉపాధి లభిస్తుంది. 2019 నాటికి ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని డేవిడ్ చెప్పారు,.