తెలుగు రాష్ట్రాల్లో అయిదు నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణాలో రెండు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు నగరాలను అత్యంత ఆధునికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా నిధులు మంజూరు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మేరకు ఢిల్లీ లో గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు.
దేశవ్యాప్తంగా 500 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ఈ పథకం కింద తెలంగాణా రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాలను, ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు అయిదేళ్ళ కార్యక్రమం ఇది.
స్మార్ట్ సిటీలంటే….ఈ నగరాల్లో పర్యావరణ ఇంధనానికి ప్రోత్సాహం ఇస్తారు. భారీగా నిర్మాణాలను చేపడతారు. సమాచార, సాంకేతిక సౌకర్యాలను బాగా అభివృద్ధి చేస్తారు. ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరుస్తారు. రవాణా సౌకర్యాలను పెంచుతారు. మురుగునీటి సౌకర్యాలను ఆధునికం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం, ప్రైవేటు భాగస్వామ్యంలో
10 శాతం నిధులు సమకూరుస్తారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ‘అమృత్’ అని పేరుపెట్టింది.