మెల్బోర్న్ లో శ్రీ ఓం సాయి ప్రస్థానం

సదా సత్వ రూపం ప్రసన్నాత్మ భావం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

ఈ సృష్టి లో సకల చరాచర జీవాలకు అభయ హస్తమందించి అనునిత్యమూ శివుని శిరస్సు నుండి జాలువారిన గంగలా ప్రేమామృతాన్ని మానవాళికి నిర్విఘ్నంగా నిర్నిబంధంగా అందిస్తూ ఇహ లోకంలో దైవముగా కొలవబడిన శ్రీ షిర్డీ సాయి బాబా మందిరాన్ని మెల్బోర్న్ మహా నగరంలో నిర్మించాలన్న తలంపుతో మార్చి 9 2010 వ తేదీన శ్రీ అనిల్ కొలనుకొండ మరియు వారి అర్ధాంగి శ్రీమతి గిరిజ కొలనుకొండ గార్ల అద్వర్యంలో శ్రీ బాబా గారి భక్తుల సమక్షంలో మొట్ట మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానంతరం గురుపూర్ణిమ, బాబా పుణ్యతిధి, దసరా, శ్రీరామ నవమి మరియు శ్రీ సత్యవ్రతము మొదలగు ఎన్నో పుణ్య కార్యక్రమాలు పండగలు జరుపుతున్నారు. ఈ పండగలను తు.చ తప్పకుండా జరపడంలో అంతరార్ధాన్ని వివరిస్తూ శ్రీ అనిల్ గారు “ఈ పండగలు జరపడం ద్వారా మన హిందూ సంప్రదాయాన్ని పాటించడమే కాకుండా భావి తరాల వారికి మన సంస్కృతీ సంప్రదాయాల్ని అందించిన వారమౌతామన్నారు”. ఇలా కార్యక్రమాల్ని నిర్వహించడంతో పాటు ఆస్ట్రేలియా పౌరులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో “ఓం సాయి” సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థలో ముఖ్యంగా మన తెలుగు సమాజానికి చెందిన ప్రముఖులు కార్య వర్గ సభ్యులుగాను మరియు ధర్మకర్తలు గాను వున్నారు.

మెల్బోర్న్ వంటి మహానగరంలో షిర్డీ లో వున్న సాయి బాబా మందిరంలా ఒక మందిరాన్ని కట్టడానికి పూనుకోవడం ఒక సాహసమే. అయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా సాయి నాథుడు తమకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని ఒక మమేకమైన దృష్టితో అవసరమైన వనరులు చేకూర్చుకుంటూ ఓం సాయి సంస్థ ముందుకు దూసుకు పోతున్నారు. ఈ పరంపరలో విక్టోరియా ప్రభుత్వం మరియు భారతీయ వ్యాపార సంస్థలు ఎంతో సహాయ సహకారాలన్దిస్తున్నాయని అంటున్నారు శ్రీ అనిల్ గారు. దీపావళి మరియు హోలీ మొదలైన పండగలకు కొంత మూలధనాన్ని క్రోడీకరించే మార్గాలని చేపడుతూ ఎంతో తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మందిర నిర్మాణానికి చేరువౌతున్నారు.

చేతి వేళ్ళపై లెక్కించగల సభ్యుల సంఖ్యతో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈ సంస్థ ఇప్పుడొక మహా వ్రుక్షమైంది. దీనంతటికీ బాబాయే కారణమంటారు శ్రీ అనిల్ గారు. “వారికి కావలసిన గుడి వారే కట్టించుకుంటారు. మేమంతా నిమిత్త మాత్రులం” అంటున్నారు శ్రీ అనిల్ గారు. “బాబా ఎప్పుడు ఎవరి ద్వారా ఏ పనులు చేయించుకోవాలో ఆయనే చేయించుకుంటారు. ‘నేను’ చేస్తున్నాను అనటం అవివేకం.” అక్టోబరు 21 వ తేదీన భారీ ఎత్తున జరిగిన దసరా ఉత్సవాల్లో విక్టోరియా ప్రీమియర్ శ్రీ టెడ్ బైలు పాల్గొనడం ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం. విక్టోరియా ప్రీమియర్ భారతీయ సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అరుదైన విషయం. అయితే షుమారు రెండేళ్ళ చిరు ప్రాయంలోనే ఓం సాయి సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో విక్టోరియా ప్రీమియర్ పాల్గొనడం భారతీయులందరూ ముఖ్యంగా తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం. దసరా ఉత్సవాల్లో భాగంగా భారత దేశంలోని ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన నృత్య గీతాలతో జాతీయ సమగ్రతా భావాన్ని ఉట్టిపడేలా కార్యక్రమాన్ని రూపొందించటం ఎంతో విశేషకరం. ఇంతకన్నా విశేషమేమిటంటే శ్రీ టెడ్ బైలు గారు మన భారతీయ నృత్యాలకు లయబద్ధంగా రంగస్థలం పై నాట్యం చేయడం. వీరితో పాటు బెంట్లీ పార్లమెంటు సభ్యురాలు ఎలిజబెత్ మిల్లర్ మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు.

సాయినాథుని సందేశాన్ని నలుదిశలా విస్తరింపజేస్తూనే పవిత్రమైన మన హిందూ సత్సంప్రదాయాలను పాటిస్తూ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న “ఓం సాయి” సంస్థ త్వరలోనే గుడి పనులు ప్రారంభించ గలరని ఆశిద్దాం. అయితే ఈ లక్ష్యం దిశగా తలో చేయి వేస్తే మరింత వేగంగా లక్ష్య సాధన జరగడానికి అవకాశం ఉంటుందని శ్రీ అనిల్ గారు పేర్కొన్నారు.

Send a Comment

Your email address will not be published.